చార్మినార్, డిసెంబర్ 26 : అద్దె ఇల్లు ఖాళీ చేయించే విషయంలో తలెత్తిన వివాదమే కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరిగిన దాడికి కారణమని దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య తెలిపారు. సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ గుమ్మీ చక్రవర్తితో కలిసి డీసీపీ వెల్లడించారు. ఈదిబజార్‌కు చెందిన జునైద్ ఇంట్లో ఓ మహిళ చాలా కాలంగా అద్దెకు ఉంటున్నది. ఆమె ఇల్లు ఖాళీ చేయడం లేదు. ఈ విషయాన్ని తన మిత్రులైన సులేమాన్, అబ్దుల్ అహ్మద్ ఖాన్‌కు ఇటీవల జునైద్ చెప్పాడు. వారిరువురూ వచ్చి ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆ మహిళను హెచ్చరించారు. సదరు మహిళ ఈ విషయాన్ని లలితాబాగ్ కార్పొరేటర్ అలీ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లి.. సహకరించాల్సిందిగా కోరింది. దీంతో కార్పొరేటర్ అలీ షరీఫ్ ఇటీవల జునైద్‌తోపాటు సులేమాన్, మహ్మద్‌తో చర్చించి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించాడు. చర్చల సందర్భంగా కార్పొరేటర్ కార్యాలయంలో అతడి సన్నిహితులతో జునైద్‌కు స్వల్ప వాగ్వాదం జరిగింది.
అప్పటి నుంచి నిందితులు ముర్తూజా అలీ అనాస్‌పై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా ముర్తూజా అలీపై దాడి చేయాలని సులేమాన్, అహ్మద్ ప్లాన్ చేశారు. ఈనెల 19న ముర్తూజా అలీ కార్పొరేటర్ కార్యాలయం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన నిందితులు సులేమాన్, అహ్మద్ వాగ్వాదానికి దిగారు. సులేమాన్ కోపంతో ముర్తూజాపై పేపర్ కటింగ్ చేసే కత్తితో మెడపై దాడి చేశాడు. ముర్తూజా అక్కడే కుప్పకూలిపోయాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు టీమ్‌లు రంగంలోకి దిగాయి. సోమవారం భవానీనగర్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీరించారు. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తితోపాటు రెండు సెల్ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో భవానీనగర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు అంజాద్ అలీ, రాఘవేంద్రతోపాటు ఎస్సైలు నర్సింలు, శ్రీశైలం, షేక్ బురాన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.