e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home తెలంగాణ గులాబీ మెజార్టీ పైనే చర్చ!

గులాబీ మెజార్టీ పైనే చర్చ!

గులాబీ మెజార్టీ పైనే చర్చ!
  • సాగర్‌లో అన్ని వర్గాల అనూహ్య స్పందన
  • టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వాసం
  • హాట్‌ టాపిక్‌గా మారిన నెల్లికల్లు ఎత్తిపోతల
  • కేసీఆర్‌ సభతో భారీగా పెరిగిన అంచనాలు
  • రికార్డు మెజార్టీ ఖాయమంటున్న టీఆర్‌ఎస్‌
  • నేటి ఉదయం 7 నుంచి సాగర్‌లో పోలింగ్‌

నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్‌ 16 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు లభించే మెజార్టీ ఎంత? సాగర్‌ నియోజకవర్గం పరిధిలోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోనూ ఇప్పుడు ఇదే చర్చ. వాడివేడిగా ప్రచారం సాగిన సాగర్‌ ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్‌ను శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓటింగ్‌ జరుగుతుంది. నియోజకవర్గవ్యాప్తంగా 346 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఎవరు గెలుస్తారు? అనేదానికంటే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారనే అంశంపై కేంద్రీకృతమై ఉండటం విశేషం. ఏ ఇద్దరు కలిసినా.. ఏ నలుగురు ముచ్చట పెట్టుకున్నా.. టీఆర్‌ఎస్‌దే విజయమన్న చర్చ సాధారణ అంశంగా మారింది. ప్రచారం అనంతరం క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. ఈసారి టీఆర్‌ఎస్‌ రికార్డుస్థాయిలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి.

నెల్లికల్లు లిఫ్ట్‌తో జనం కేరింతలు

ఏడాదిన్నరలోనే నెల్లికల్లు లిఫ్ట్‌ను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాలియా సభలో చేసిన ప్రకటన.. పరిస్థితి మొత్తాన్నీ ఏకపక్షంగా మార్చివేసిందని అంటున్నారు. దీనితోపాటు పోడు భూముల సమస్యకు తాను స్వయంగా వచ్చి సాగర్‌ నుంచే పరిష్కారం చూపుతానని చెప్పడం గిరిజనుల్లో నమ్మకాన్ని కలిగించింది. దీంతో కారు గుర్తుకే తమ ఓటని తండాల ప్రజలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా చూస్తే.. గిరిజన ఓటర్లే అత్యధికం. వారంతా 2018లోనే అత్యధికంగా టీఆర్‌ఎస్‌ పక్షాన నిలిచారు. ఇప్పుడు అంతకుమించిన స్పందన తండాల్లో వ్యక్తమవుతున్నది. తండాలను గ్రామపంచాయితీలుగా చేసి వాటిల్లో వాళ్లనే పాలనాధ్యక్షులుగా చేసిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌ది. దాంతోపాటు పల్లె ప్రగతితో తండాల రూపురేఖల్లో స్పష్టమైన మార్పునకు కూడా కేసీఆర్‌నే కారణం.

సంక్షేమ సర్కార్‌

నాగార్జునసాగర్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. వివిధ ఫథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు 1.53లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరందరినీ క్షేత్రస్థాయి ప్రచారంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు కలిశాయి. ఇంతటి లబ్ధి గతంలో ఏ ప్రభుత్వంతోనైనా సాధ్యమైందా అనే చర్చ పెట్టి చర్చలు పెట్టాయి. అన్నీ వివరించి ఓటరును ఆలోచింపజేశారు. గతంలో ఎన్నడూ లేనంత ఆర్థిక భరోసాతో ఉన్నామని, ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని వారు ఘంటా పథంగా చెప్పడమే కాకుండా.. భగత్‌కే తమ ఓటు అని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్‌ను కదిలిస్తే… ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా పెద్దసంఖ్యలో మహిళలు, రైతులు, వృత్తిదారులు, యువకులు ఘన స్వాగతం పలికారని, వారంతా ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు. గతంలో తన తండ్రి నర్సింహయ్య కారు గుర్తుపై ఓటేశామని, మళ్లీ కారుకే ఓటేస్తామని చెప్పారని వివరించారు. మంచి మెజార్టీతో గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు.

రికార్డు మెజారిటీ ఖాయం

ఈ నెల 14న హాలియాలో జరిగిన కేసీఆర్‌ సభతో మొత్తం వాతావరణమే మారిపోయేలా చేసింది. అప్పటివరకు అంతో ఇంతో ఆశలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కాడి కింద పడేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నేతలు సీఎం సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్న చర్చ సాగింది. కాంగ్రెస్‌ ప్రయత్నాలు విఫలమై, సీఎం సభ భారీగా సక్సెస్‌ కావడం ప్రజలను టీఆర్‌ఎస్‌ వైపు మరింత సంఘటితం చేసిందని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ నామినేషన్‌ నాటికి సాగర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైందన్నారు. ప్రచారంలో ముందుకు సాగుతున్నా కొద్దీ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే భారీ మెజార్టీ వస్తుందని అంచనా వేశామన్నారు. కేసీఆర్‌ సభతో టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో విజయం ఖాయమని ప్రజలే తమకు చెప్తున్నారని అన్నారు. సాగర్‌ ప్రజలు అభివృద్ధిని కోరకుంటున్నారని, అది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. జానారెడ్డికి వేసే ఓటు మురిగిపోతుందన్న భావన మెజార్టీ ప్రజల్లో వ్యక్తం అవుతుందని అన్నారు.

  • మొత్తం ఓటర్లు : 2,20,300
  • పురుషులు 1,09,228
  • మహిళలు 1,11,072
  • పోలింగ్‌ కేంద్రాలు 346

ఓటరు గుండెను తట్టిన సంక్షేమం

సాగర్‌లో తమదే గెలుపని ప్రచారం ముగింపు సమయానికే స్పష్టమైందని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. పార్టీ యంత్రాంగం నెల రోజులుగా క్షేత్రస్థాయిలో ప్రతి ఊరినీ, ప్రతి ఇంటినీ, ప్రతి ఓటరునూ నిత్యం కలుస్తూ ప్రచారం చేసిన తీరు ప్రజలను ముందు నుంచే ఆలోచనల్లో పడేసిందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన, చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఓటరు గుండెను తట్టాయని చెప్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ జిల్లా అయిన నల్లగొండలో ఉచిత విద్యుత్తు.. సాగులో విప్లవాత్మక మార్పు తెచ్చింది. దాంతో ఏ సామాజికవర్గానికి చెందిన రైతులైనా సరే.. కేసీఆర్‌ సర్కార్‌కే జై కొడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలతో మమేకమైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇదే విషయమై స్పందిస్తూ.. సాగర్‌లో రైతులంతా టీఆర్‌ఎస్‌ పక్షాన నిలబడుతున్నారని ధీమా వ్యక్తంచేశారు. నెల రోజులుగా గ్రామాల్లో చర్చలను ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశీలించానని, ప్రతిచోటా సాగు పట్ల కేసీఆర్‌కు ఉన్న విజన్‌ను రైతులు అభినందించారని వివరించారు. రైతులేగాక.. మహిళలు, వృత్తిదారులు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సారి సాగర్‌లో రికార్డు మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ విజయం సాధించబోతున్నారని వెల్లడించారు. ప్రత్యర్థులు దరిదాపుల్లోనూ ఉండబోరని ఆయన అంచనా వేశారు.

Advertisement
గులాబీ మెజార్టీ పైనే చర్చ!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement