హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున ఇండ్ల కూల్చివేతలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం తమకు తెలిపినట్టు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి టోకన్ సాహు తేల్చిచెప్పారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి మూసీ ప్రాజెక్టు అంశంపై ప్రశ్నలను లేవనెత్తారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవ పథకం పేరిట జరుగుతున్న పర్యవసనాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని సురేశ్‌రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత కూల్చివేతల వల్ల వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫలితంగా నదీ పరీవాహక ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని తెలిపారు. దీనికి కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి టోకన్ సాహు సమాధానం ఇచ్చారు. మూసీ పునరుజ్జీవ పథకం వల్ల కేవలం 15,000 ఇండ్లే కూలిపోతున్నాయని, వీరికి మానవతా దృక్పథంతో ఇండ్ల నిర్మాణం, మంచి ప్యాకేజీ అందిస్తామని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు చెప్పిందని మంత్రి తెలిపారు. పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండబోవని, అవసరం మేరకే ఇండ్లు తొలగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపినట్టు కేంద్రమంత్రి వెల్లడించారు.