Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్‌తో అంతర్మథనం మొదలైంది. నీతి, న్యాయం లేకుండా, అన్యాయమో, అక్రమమో చూడకుండా ఇష్టారీతిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై కేసులు బుక్ చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పరోక్షంగా కేసీఆర్ హెచ్చరించడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఎల్కతుర్తి మహాసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒక్కమాట పోలీసు మిత్రులకు మనవి చేస్తున్నా.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటది. ప్రజలు అడుగుతారు. అడిగే హక్కును సోషల్‌మీడియాలో కూడా కాలరాస్తున్నారు. ప్రశ్నించినవారిపై కేసులు, వాళ్లను పట్టుకొనిపోవుడు. పోలీసు సోదరులను నేను అడుగున్నా.. మీరెందుకు దునుకులాడుతన్నరు? మీకేం అక్కరొచ్చింది? ఈ రాత్రి మీరు మీ డైరీల్లో రాసుకోండి. మల్లా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దానిని ఆపడం ఎవరితరం కాదు. మీకు తెల్వదా? మీరు చదువుకోలేదా? ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నరు? రేపు మీరెందుకు బలవుతరు? మీకు రాజకీయాలెందుకు? మీ డ్యూటీ మీరు చెయ్యండి.
బీఆర్ఎస్ ఎప్పుడూ శాసనాన్ని ఉల్లంఘించదు. చట్టాలను ఉల్లంఘించం’ అని లక్షలాది జనసమూహం ఎదుట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కొందరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పదేండ్లపాటు శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా పాలన సాగించిన కేసీఆర్ అంతటి వ్యక్తే.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కొందరిలో మార్పు మొదలైంది. కేసీఆర్ చెప్పిన ఆ మాటలను ఎంతోమంది తమ వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకోవడంతో.. ఆయన చెప్పిన అంశం ప్రజల్లోకి బాగా వెళ్లింది. దీంతో ‘మనకెందుకు.. మన డ్యూటీ మనం చేసుకుందాం. ఇకనుంచి ఏదైనా చట్టపరంగానే చేద్దాం’ అంటూ పలువురు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. ‘డిపార్ట్మెంట్లో కొందరు అతి చేయడం వల్లనే ఇట్లాంటి వార్నింగ్‌లు వినాల్సి వస్తున్నది’ అని కొందరు సిన్సియర్ ఆఫీసర్లు చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని భావిస్తున్న కొందరు పోలీసులు.. ఏకపక్షంగా ఉంటే భవిష్యత్‌ను నాశనం చేసుకోవడమేనని ధోరణికి వచ్చారు. ఒక పార్టీకే సపోర్ట్ చేస్తే.. నాన్ ఫోకల్లోనే ఉండాల్సి రావొచ్చని భయపడుతున్నారు. ఎల్కతుర్తి వేదికగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌తో పోలీసుల్లో అంతర్మథనం మొదలైంది.