CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమవుతుందా అని కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఊగిసలాడుతున్నది. అమెరికా ఆర్థిక మాంద్యం భయంతోనే సోమవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మన దేశంలో ఒకే రోజు రూ.15 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మరోవైపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు సైతం కొత్త అధ్యక్షుడికి తగ్గట్టుగా తమ పాలసీలు మార్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రతినిధి బృందం పెట్టుబడులు సాధిస్తుందా? అన్నది మార్కెట్ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇందుకు కాగ్నిజెంట్ ప్రకటనే ఉదాహరణగా చెప్తున్నారు. తెలంగాణలో 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామని, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ పెడతామని కాగ్నిజెంట్ ప్రకటించిందని సీఎంవో తెలిపింది. ఇదే సంస్థ గత ఏడాదిన్నర కాలంలో 7 వేల మంది ఉద్యోగులను తొలగించిందని, ఆఫీస్ స్పేస్ లీజును రద్దు చేసుకున్నదని చెప్తున్నారు. ఇలాంటి సంస్థ వ్యాపార విస్తరణ ఎలా చేపడుతుందని ప్రశ్నిస్తున్నారు.
సీఎం రేవంత్ ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించామని, తెలంగాణ చరిత్రలోనే అత్యధికమని చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడుల్లో అత్యధికం బోగసని విమర్శలు వచ్చాయి. మూలధనమే లేని గోడి ఇండియా కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ విమర్శించింది. జేఎస్డబ్ల్యూ సంస్థ 2022లో చేసుకున్న రూ.9 వేల కోట్ల ఒప్పందాన్నే మళ్లీ చెప్పుకున్నారని ఆరోపించారు. అదానీ కంపెనీ ఇప్పటివరకు పెట్టుబడి పెట్టలేదని, పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు అప్పగించారని విమర్శిస్తున్నారు. టాటా, జిందాల్, వెబ్వర్క్స్, ఆరాజెన్, క్యూసెంట్రియో, ఓ9 సొల్యూషన్స్, గోద్రెజ్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్.. కంపెనీలు వస్తాయని, 35 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పుకున్నారని, ఆ కంపెనీల్లో ఏవి గ్రౌండింగ్ అయ్యాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాటి దావోస్ తరహాలోనే ఈసారి అమెరికా పర్యటన కూడా ఉత్తుత్తిదనే! అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.