హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధికి మోకాలడ్డుతున్న కేంద్రం.. జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకంలోనూ తెలంగాణకు నిధులు కేటాయించడంలో పక్షపాతం చూపుతున్నది. ఇతర రాష్ర్టాలకు విరివిగా నిధులు ఇస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఐదేండ్లుగా ఏ ఏటికా యేడు కేంద్రం తెలంగాణకు నిధులు తగ్గిస్తూ వస్తున్నది. జాతీయ ఆహార భద్రతామిషన్ లక్ష్యం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం యాంత్రీకరణను ప్రోత్సహించడం, మెరుగైన యాజమాన్య పద్ధతులను రైతులకు పరిచయం చేయడం, హైబ్రిడ్ విత్తనాల పంపిణీ.. భూసారం పెంపునకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని అమలుచేసేందుకు రాష్ర్టాలకు తగిన నిధులు ఇవ్వాల్సి ఉంటుంది.కేంద్రం మాత్రం బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరదపారిస్తూ.. తెలంగాణకు మొండిచెయ్యి చూపిస్తున్నది.
ఏటికేడు తగ్గుతున్న కేటాయింపులు…
ఎన్ఎఫ్ఎస్ఎం పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ప్రతియేట కేటాయింపులను తగ్గిస్తూ వస్తున్నది. కేటాయించిన ఆ మాత్రం నిధులను కూడా పూర్తిగా విడుదల చేయడంలేదు. 2017-18లో రూ. 51.11 కోట్లు కేటాయించిన కేంద్రం 2021-22లో రూ. 21.94 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే దాదాపు రూ. 30 కోట్లు తగ్గించడం గమనార్హం. రూ.21.94 కోట్లలో నయా పైసా విడుదల చేయలేదు. ఈ ఏడాదికి రాష్ర్టానికి నిధులే కేటాయించలేదని సమాచారం. ఎన్ఎఫ్ఎస్ఎం పథకం కింద గతేడాది అత్యధికంగా మధ్యప్రదేశ్‌కు రూ.282.67 కోట్లు కేటాయించి, రూ.169.56 కోట్లు విడుదల చేసింది. రాజస్థాన్‌కు రూ.199.50 కోట్లు కేటాయించి, రూ.89.50 కోట్లు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌కు 119.85 కోట్లు కేటాయించి, రూ.52.73 కోట్లు విడుదల చేసింది. మహారాష్ట్రకు రూ.139.33 కోట్లు కేటాయించి, రూ.44.68 కోట్లు విడుదల చేసింది. కర్ణాటకకు రూ.121.74 కోట్లు కేటాయించి, రూ.82.34 కోట్లు విడుదల చేసింది. అస్సాంకు రూ.102.29 కోట్లు కేటాయించి, రూ.15.83 కోట్లు విడుదల చేసింది.