హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులా తపస్సు చేసినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. వివిధ పథకాల ద్వారా సీఎం కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే కేంద్రం నుంచి రాష్ర్టానికి నిధులు రాకుండా బీజేపీ నాయకులు మోకాలడ్డుతున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ను ప్రజల్లో అభాసుపాలు చేయాలనే కుట్రపూరిత ఆలోచనలతో బీజేపీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శించారు. పద్నాలుగు రాష్ట్రాల రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్న కేంద్రం.. తెలంగాణ విషయంలో ఎందుకింత పగబట్టిందో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.34,149 కోట్ల నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించకపోవడం తగదని చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుంటే బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారని ప్రశ్నించారు.