రాజన్న సిరిసిల్ల, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని పెద్దూరు శివారులో నేత కార్మికులు, మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో తెలంగాణ ప్రాంత కార్మికులపై వివక్ష కొనసాగుతున్నట్టు పలువురు కార్మికులు తెలిపారు. నిర్వాహకులు తమను చిన్నచూపు చూస్తూ పనిలో నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో కంపెనీలో శిక్షణ పొందిన వారు పనిచేయడానికి వెనుకాడుతున్నట్టు సమాచారం. స్థానిక ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా ప్రాంతీయ వివక్ష చూపుతున్నారని పలువురు మనోవేదనకు గురవుతున్నారు. అపెరల్ పార్కులో కంపెనీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానికులకు ఉపాధి కోసం ఏర్పాటు
కేసీఆర్ సర్కార్ హయాంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అపెరల్ పార్కు ఏర్పాటు చేయడంతోపాటు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఒప్పించి తీసుకువచ్చారు. ఈ పార్కు కోసం స్థలాలు ఇచ్చిన స్థానికులతోపాటు జిల్లాలోని నేత కుటుంబాలు, బీడీ కార్మికులు, యువతులకు ఉపాధి కల్పించారు. నేత కార్మికులకు చేతినిండా పని కల్పించారు. నేత కుటుంబాల్లో బీడీలు చుట్టే మహిళలు, యువతులు, ఇతర కూలి పనులకు వెళ్తున్న మహిళలకు ప్రత్యేక కుట్టు శిక్షణ అందించి పనులు కల్పించారు.
గోకులదాస్, టెక్స్‌పోర్ట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని అపెరల్ పార్క్‌ను 2022 మార్చి 7న ప్రారంభించారు. ప్రస్తుతం గోకులదాస్, టెక్స్‌పోర్ట్ కంపెనీలు కొనసాగుతున్నాయి. ఈ పార్క్‌లో టీషర్టులు తయారు చేస్తున్న కంపెనీ 2024లో ప్రారంభమైంది. రెండు కంపెనీల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు, మరో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 9 బస్సుల్లో కార్మికులను పనుల్లోకి తీసుకువస్తారు. ఉదయం 9 నుంచి సాయం త్రం 5.50 వరకు పనిచేయాల్సి ఉంటుంది.
సెలవులు లేవు..
ఈ కంపెనీల్లో కొత్తగా చేరే వారికి మొదట 45 రోజులు శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత పనిలోకి తీసుకుంటారు. పనిలో చేరిన తర్వాత 6 నెలల వరకు సెలవులు, అత్యవసర సెలవులు ఎలాంటివీ ఇవ్వడం లేదని తెలిసింది. ప్రతి ఆదివారం సెలవుతోపాటు నెలలో 26 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. ఓటీ చేసినా వేతనం ఇవ్వకుండా లీవ్‌లు ఇస్తామని చెప్తున్నారని పలువురు కార్మికులు చెప్తున్నారు. ఆదివారం సైతం ఓటీ చేయించుకుంటున్నా ఓటీ డ్యూటీకి డబ్బులు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. కంపెనీకి చెందిన ముఖ్య అధికారి ఇతర రాష్ర్టానికి చెందిన వారు కావడంతో తెలంగాణకు చెందిన సిబ్బంది, కార్మికులపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు చెందిన కార్మికులు, సిబ్బంది లీవ్‌లు అడిగినా చీదరించుకోవడం, ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు. చిన్నచూపు చూడటంతోపాటు హేళన, వెకిలి చేష్టలు చేస్తున్నారని చెప్తున్నారు. సదరు అధికారి ఆంధ్రాతోపాటు తన ప్రాంతంవారికి కోరగానే లీవ్‌లు, అడగ్గానే సడలింపులు, అన్ని అనుమతులు ఇస్తున్నారని వారు కుమిలిపోతున్నారు. గతంలో పలుమార్లు అధికారులు అపెరల్ పార్క్‌ను సందర్శించి, కోరిన వెంటనే సెలవులు ఇవ్వడంతోపాటు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు సిబ్బంది వాపోతున్నారు.