హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు (Pending Challan) రాయితీ గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. డిసెంబర్ 25వ తేదీ వరకు ట్రాఫిక్ ఈ-చలాన్లపై ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి చెల్లింపునకు అవకాశం కల్పించింది. జనవరి 10తో గడువు ముగిసిపోనున్నది. దీంతో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఇప్పటివరకు 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. కాగా, సైబర్ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహాలు ఎదురైనా 040-27852721, 8712661690 (వాట్సాప్) నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాకింగ్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
బైక్‌లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. గతేడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల ఆదాయం సమకూరింది.