హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యశోద దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సోమాజిగూడలోని యశోద దవాఖాన వైద్యులు తుంటిమార్పిడి శస్త్రచికిత్స చేశారు. వారంపాటు దవాఖానలోనే చికిత్స అందించారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో వైద్యులు శుక్రవారం డిశ్చార్జి చేశారు. తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
తనకోసం దవాఖానకు వచ్చిన అభిమానులు, నాయకులకు అభివాదం చేశారు. హాస్పిటల్నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకొన్నారు. కేసీఆర్ ఇంటికి వస్తున్నారని తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. గులాబీ అధినేతను చూసేందుకు నందినగర్ కిటకిటలాడింది. ఇంటి ముందు కేసీఆర్‌కు సంప్రదాయ పద్ధతిలో దిష్టితీసి, హారతిపట్టి స్వాగతం పలికారు. కేసీఆర్ ఇంట్లోకి చేరగానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ వేదపండితులచే ఆశీర్వచనాలు ఇప్పించారు. దవాఖాన వద్ద ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తదితరులు వెంట ఉన్నారు.