హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీమారంగంలో కామధేనువు లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)ని తెగనమ్మేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ విమర్శించారు. ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వ్యతిరేకంగా శనివారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎల్ఐసీని వాటాలుగా విభజించి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, ఇది పూర్తిగా ప్రజావ్యతిరేకమని ధ్వజమెత్తారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎల్ఐసీ విలువ రూ.5 లక్ష ల కోట్లకుపైగా ఉన్నదని, అందుకు పాలసీదారులే కారణమని పేర్కొన్నారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణను ఆపే వర కూ పోరాటాన్ని ఆపమని, మరిన్ని నిరసన కార్యక్రమాలతో ముందుకు సాగుతామని సిటీ బ్రాంచ్-7 యూనియన్ అధ్యక్షుడు మహేశ్, కార్యదర్శి వీ రమేశ్‌గౌడ్ హెచ్చరించారు. వెబినార్‌లో 700 మందికిపైగా బీమా ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.