Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే నివేదికను సమర్థించుకునేందుకు కాంగ్రెస్ అపసోపాలు పడుతున్న ది. సర్వే సజావుగా సాగలేదంటూ బీసీ సం ఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు, చివరకు సొంతపార్టీ నేతల నుంచి సైతం విమర్శ లు వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అసెంబ్లీ సమావేశంలోనూ వివరణ ఇవ్వలేక బోల్తాపడింది.
గతంలో క్యాబినెట్ సబ్‌కమిటీ నివేదించిన సర్వే గణాంకాల ను అసెంబ్లీ వేదికగా వెల్లడించారే తప్ప కాం గ్రెస్ ప్రభుత్వం కొత్తగా చెప్పిందేమీ లేదంటూ బీసీ సంఘాల నేతల నుంచి విమర్శలు పోటెత్తాయి. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఒకవైపు మంత్రులు, మరోవైపు పలువురు కాం గ్రెస్ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. అసెంబ్లీ హాల్ లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా కులగణనపై ప్రజెంటేషన్ ఏర్పాటుచేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఆ సమావేశాల్లోనూ పూర్తి గణాంకాలను బయటపెట్టకుండా, చెప్పి న లెక్కలే పదేపదే చెప్తున్నారంటూ బీసీ నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి
కులగణన సర్వే నివేదికపై స్వపక్షం నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో కాం గ్రెస్ కంగుతింటున్నది. సర్వే గణాంకాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తూ, వ్యతిరేకిస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే ఏకంగా సర్వే నివేదికనే కాల్చిపారేశారు. ఇది అగ్రకుల సర్వే అంటూ అభివర్ణించారు. కొందరు ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. నివేదికపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
ఎమ్మెల్యేలను సంతృప్తి పరచని ప్రజెంటేషన్
సర్వేపై సొంతపార్టీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తుండటంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు గంటలపాటు బీసీ గణనపై ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. సర్వే వివరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వివరించింది. ప్రజంటేషన్‌లోనూ కొత్తగా చెప్పింది ఏమీ లేదని పలువురు ఎమ్మెల్యేలు మరోసారి అసంతృప్తి వ్యక్తంచేయడం గమనార్హం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికను, సర్వే ఏ తీరుగా, ఎంతమందిని చేసిం ది? ఎందరు అధికారులు పాల్గొన్నది తదితర గణాంకాలనే మళ్లీ ఏకరువు పెట్టారు తప్ప కొత్తగా ఏమీలేదని పలువురు ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యలోనే వెళ్లిపోయారు.
పొరపాట్లుంటే సరిచేస్తాం: పొన్నం
కులగణనను ప్లాప్ చేయాలని కుట్ర చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల గణనలో పాల్గొననివారికి దానిపై మాట్లాడే నైతికత లేదని పేర్కొన్నారు. కులగణనలో ఏం పొరపాటు జరిగిందో చెప్పాలని, నిజంగానే పొరపాట్లుంటే బాధ్యతగా సరిచేస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే అన్ని హామీలు అమలుచేస్తామని తెలిపారు. కేంద్రంపై పోరాడేందుకు తమతో గొంతు కలపాలని కోరారు.
ఉపకులాలవారీగా వివరాలు వెల్లడిస్తాం: ఉత్తమ్
సర్వేకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను కాకుం డా, కులా లు, ఉపకులాలు, జిల్లాలవారీగా సమస్త సమాచారాన్ని రెండ్రోజుల్లో పబ్లిక్‌డొమైన్‌లో పెడతామని సబ్‌కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మీడియా ప్రతినిధులతో బుధవారం చిట్‌చాట్ చేశారు. కుల గణన సర్వేపై కొందరు అపోహలు వ్యక్తంచేస్తున్నారని అన్నారు. మొదట సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చుకున్నారని, అది పబ్లిక్ డొమైన్లో లేని డాక్యుమెంట్ అని, ఎస్సీ వర్గీకరణ కూడా 2011ను ఆధారంగా చేసుకుని చేసిందేనని వివరించారు. సర్వేపై అపోహలను కులసంఘాల నేతలకు నివృత్తి చేస్తామన్నారు.