రామాయంపేట రూరల్, మే 12: హామీలు ఇవ్వడం వాటిని అమలు చేయకపోవడం,అడిగితే ప్రతిపక్షాలపై నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇందులో దివ్యాంగులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ.6 వేలు పెంచుతామని ప్రకటించింది. ఈ అంశం మెనిఫెస్టోలో సైతం పెట్టారు. కానీ ఇప్పటికి అమలు కాకపోవడం పట్ల వికలాంగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రూ.3016 ఉండగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ.4016కు పెంచింది. అదే నేటికి అమలవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలు పెంచడంతో వికలాంగులు మొదట్లో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పలుమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పలితం లేకుండా పోయిందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుల బాధలు అర్థం చేసుకొని కేసీఆర్ రూ.వెయ్యి పెంచారని, కానీ నేటి ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు.
వికలాంగుల ఆగ్రహానికి గురికావడం ఖాయం..
వికలాంగుల భాదలు అర్థం చేసుకొని ఇచ్చిన హామీ అమలు చేయాలని వికలాంగుల సంఘం జిల్లా ఉపాద్యక్షుడు గంగాపురం సంజీవులు అన్నారు. లేకుంటే వికలాంగుల ఆగ్రహానికి గురి కవడం ఖాయం. లేని ఆశలు చెప్పి ఇప్పుడు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. మెనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయక పోవడం మంచిది కాదు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణం మరీ కష్టంగా మారింది. మాకు కేటాయించిన సీట్లు కూడా దొరకడం లేదు. పెంచుతామన్న పెన్షన్ వెంటనే పెంచాలి. ఈ విషయంలో త్వరలోనే కార్యచరణ రూపొందిస్తాం.
మా బాధలను అర్థం చేసుకోవాలి..
దివ్యాంగులమైన తమకు అనేక భాదలు ఉంటాయని కుస్తి సిద్దిరాములు అన్నారు. అందరిలాగా పనులు చేయలేక ఉంటున్న మాకు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీమేరకు పెన్షన్ వెంటనే పెంచాలి. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కానీ మాకు ఇచ్చిన హామీ అమలు కోసం మాత్రమే మా తాపత్రయమన్నారు.
కేసీఆర్ ఉంటే ఈ భాద ఉండేది కాదు..
గతంలో మా భాదలను అర్థం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం రూ.వెయ్యి పెంచిందని మధునాల ఎల్లాగౌడ్ అన్నారు. అధికారంలోకి రాకముందు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఉండి ఉంటే మాకు ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అడగకుండానే అప్పట్లో పెన్షన్ పెంచారు. ఇప్పుడు ఉండి ఉంటే బాగుండేదని చెప్పారు.