Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు తమకు సంక్షేమ ఫలాలు అందించేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొంతకాలంగా గళమెత్తుతున్నారు. వీరంతా కూడా స్త్రీశిశు సంక్షేమశాఖ పరిధిలో ప్రభుత్వాల నుంచి చేయూత అందుకుంటున్నారు. అయితే కేంద్రంతో పాటు పలు రాష్ర్టాల్లో వీరి కోసం ప్రత్యేకశాఖలు ఉన్నాయి. అభాగ్యులకు ఆసరాగా నిలిచేందుకు విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లను స్త్రీశిశు సంక్షేమశాఖ నుంచి వేరు చేసి, ప్రత్యేకంగా సాధికారసంస్థను ఏర్పాటుచేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా వెలువరించింది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్వతంత్రశాఖను అటకెక్కించింది.
కష్టాలు పట్టని కాంగ్రెస్ సర్కారు
స్త్రీశిశు సంక్షేమశాఖ నుంచి తమను వేరు చేయాలని దివ్యాంగుల రాష్ట్ర సలహా మండలి గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. న్యాయమైన విన్నపం కావడంతో అప్పటి సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించారు. దివ్యాంగుల స్వతంత్రశాఖను ఏర్పాటు చేస్తూ 2022 డిసెంబర్ 2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ శాఖకు దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత సంస్థగా పేరు ఖరారు చేసింది. ప్రభుత్వం, కేసీఆర్ నిర్ణయంపై దివ్యాంగులు ఎంతగానో హర్షం వ్యక్తంచేశారు. ప్రత్యేకశాఖతో కలిగే ప్రయోజనాలెన్నోరాష్ట్రవ్యాప్తంగా 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ కోసం పింఛన్లు సహా పలు పథకాలు అమలు చేస్తున్నది. కేంద్రం అధీనంలో 8 జాతీయ సంస్థలు, 20 కాంపోజిట్ రీజినల్ సెంటర్లు సేవలు, రుణాలను అందిస్తున్నాయి. ప్రత్యేకశాఖ లేనందున ఆ సేవలు మన రాష్ట్ర దివ్యాంగులకు దక్కడంలేదు. 2016లో కేంద్రం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టం వల్ల దక్కాల్సిన ప్రయోజనాలను అందుకోలేని దుస్థితి నెలకొంది.
అభాగ్యుల అవస్థలు.. సర్కారు సాకులు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దివ్యాంగుల ప్రత్యేకశాఖ కోసం 33 జిల్లాలకు కలిపి సుమారు 150మంది సిబ్బంది అవసరం. ఈ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సిబ్బంది లేరనే సాకుతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే శాఖల విభజనను చేయడం లేదని దివ్యాంగుల హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. సత్వరమే స్వతంత్రశాఖగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దివ్యాంగులు అన్నింటా ముందుండాలి: సీతక్క
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అంగవైకల్యంతో కుమిలిపోవద్దని ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లి అన్నింటా రాణించాలని రాష్ట్ర మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి దివ్యాంగులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆమె అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.