చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులు
‘యూనివర్సిటీ పేపర్ లీకేజీ’ సినిమాను ఆదరించండి
దర్శకనిర్మాత, సినీనటుడు పీపుల్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి
R Narayanamurthy | హనుమకొండ చౌరస్తా, జులై 28: విద్య వ్యాపారంగా మారిందని కార్పొరేట్ కబంధహస్తాలలో చదువు చిక్కుకున్నది, చదువుకునే రోజుల నుంచి చదువు కొనుక్కునే పరిస్థితులను వివరిస్తూ వర్సిటీ పేపర్ లీకేజ్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ స్నేహ చిత్ర పిక్చర్స్‌లో తెరకెక్కిన సినిమా ‘యూనివర్సిటీ పేపర్ లీకేజ్-ఏ ఫిలిం బై ఆర్ నారాయణమూర్తి’ ఆగస్టు 22న విడుదలవుతుందని, సినిమాని వీక్షించి అందరూ ఆదరించాలని దర్శక నిర్మాత, నటుడు పీపుల్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. సోమవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ‘యూనివర్సిటీ పేపర్ లీకేజ్’ సినిమా పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ సామాజిక అసమనతులపై, విద్య, వైద్యం, క్లాసిఫికేషన్, క్యాస్టిఫికేషన్ అంశాలపై తన జీవితాన్ని సినిమా రంగానికి అంకితం చేసి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సినిమా రూపంలో ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వెండితెరపై దశాబ్దాలుగా మన జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ప్రస్తుతం కార్పొరేట్ కబంధహస్తాలలో చిక్కుకున్న చదువు, ఈరోజుల్లో ఎక్కడ చూసినా పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణంగా మారిందని, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్ లీక్ కావడం ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యార్థుల పరీక్ష పత్రాలు లీక్ అంటే ఈ సమాజాన్ని నాశనం చేయడమేనన్నారు. కార్పొరేట్ కబంధహస్తాలలో విద్య ఇరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చారని, తన సినిమాని ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు, నిరుద్యోగులు విద్యార్థులు అధిక సంఖ్యలో చూసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిసంఘాల నాయకులు భాషబోయిన సంతోష్, రంజిత్‌కుమార్, సాయి, వేల్పుల చరణ్, కసరబోయిన రవితేజ, సిపతి వినయ్, వంశీకృష్ణ, విజయ్, కళ్యాణ్, వినయ్, హర్షద్ పాల్గొన్నారు.
—-