హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో అనుసరించే విధానంపై పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. పదో తరగతి తుది ఫలితాల్లో ఇంటర్నల్ మార్కులుండవని తేల్చిచెప్పింది. ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ) మార్కులను వార్షిక పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘గ్రేడింగా? మార్కులా? శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకన రద్దు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 2025-26 విద్యాసంవత్సరంలో 1-10 తరగతుల విద్యార్థులందరికీ నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలవుతుందని అన్నారు. అన్ని తరగతులకు ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షలను యథావిథిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.