హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే పలుమార్లు నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుడిన వారి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని విజిలెన్స్‌శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ఆదేశించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడేందుకు విజిలెన్స్ అధికారులు తీసుకుంటున్న పటిష్ఠ చర్యలపై మంగళవా రం ఆయన సమీక్షించారు.
రానున్న వ్యవసాయ సీజన్‌కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ప్యాకేజింగ్, నకిలీ లేబుల్స్ వంటి వాటిపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఒక్కో విజిలెన్స్ అధికారి తమ పరిధి జిల్లాల్లోని విత్తన కేం ద్రాలు, వారి పరిధిలో ఇప్పటికే పట్టుబడిన నకిలీ విత్తన విక్రేతల వివరాలు తెప్పించుకోవాలని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో అవినీతికి తావులేకుండా చూడాలని తెలిపారు. విజిలెన్స్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిల్లో పర్యటించాలని, తమ పరిధిలోని విభాగాల్లో ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేయాలని డీజీ ఆదేశించారు.