హైదరాబాద్, మే31 (నమస్తే తెలంగాణ): డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా గ్రూప్-1, గ్రూప్-2 సర్వీస్‌లో ఖాళీ పోస్టులను పక్కాగా లెకించాలని, కొత్త జిల్లాలకు సైతం పోస్టులు మంజూరు చేయాలని, ఆప్షన్ పద్ధతిని, వెయిటింగ్ లిస్టు పద్ధతిని అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డిని శుక్రవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయాలని, ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెకించాలని కోరారు. ఒకే దఫా గ్రూప్ 1, 2,3,4 టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నందున మెరిట్ అభ్యర్థులు ఆయా పోస్టులన్నింటికీ సెలెక్ట్ అవుతారని పేర్కొన్నారు. దీంతో ఆ అభ్యర్థి ఒకే పోస్టును ఎంపిక చేసుకుంటారని, మిగతా పోస్టులు మళ్లీ ఖాళీగా మిగిలిపోతాయని తెలిపారు. వెయిటింగ్ లిస్టు పద్ధతిని సైతం ప్రవేశపెట్టి పోస్టులు మిగిలిపోకుండా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. యువతరాన్ని డైరెక్టు ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకువస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన లభిస్తుందని తెలిపారు. కృష్ణయ్య వెంట బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, గొరిగే మల్లేశ్‌యాదవ్, వేముల రామకృష్ణ, కోట్ల శ్రీనివాస్, నందా గోపాల్, రాజ్‌కుమార్ తదితరులున్నారు.