వరంగల్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ దీక్షతోనే సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని దాస్యం ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ సెంటర్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సహకరించలేదన్నారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు దీక్షా దివస్ నుంచి తెలంగాణ ప్రకటన రోజు(డిసెంబర్ 9) వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా దాస్యం ప్రణాళిక రూపొందించారు. మంగళవారం(29న) కాళోజీ జంక్షన్ వద్ద దీక్షా దివస్ ఉత్సవాలు మొదలయ్యాయి. 30న జయశంకర్ స్మృతివనం నుంచి అదాలత్ జంక్షన్‌లోని అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తారు. డిసెంబర్ 1న జీడబ్య్లూఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అదాలత్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వరకు టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. డిసెంబర్ 2న హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్ హాల్లో తెలంగాణ ఉద్యమాన్ని వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్. డిసెంబర్ 3న అమరవీరుల సంస్మరణ సభ. డిసెంబర్ 4న కాజీపేటలో ఉద్యమకారులు, కవులు, కళాకారులకు సన్మానం. డిసెంబర్ 5న జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం. డిసెంబర్ 6న అంబేద్కర్ ఆలోచన- కేసీఆర్ ఆచరణ కార్యక్రమం. డిసెంబర్ 7న విద్యార్థి యువజన, ఉద్యమకారుల అలయ్, బలయ్. డిసెంబర్ 8న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ. డిసెంబర్ 9న టీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయ ప్రారంభం, పునరంకిత సభ నిర్వహించనున్నారు.