ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారం కోసం నాటి ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన దీక్ష రోజును పురస్కరించుకుని ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు జిల్లాలో మంగళవారం పలు కార్యక్రమాలు చేపట్టారు. దీక్షా దివస్ సందర్భంగా వర్ధన్నపేట మండలం ఇల్లందలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకట నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చడానికి బీజం పడిన రోజు దీక్ష దివస్ అని పలువురు పేర్కొన్నారు.
వర్ధన్నపేట : ఇల్లందలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, నవంబర్ 29: దీక్షాదివస్‌ను జిల్లావ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట మండలం ఇల్లందలో పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాలాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29వ తేదీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, సర్పంచ్ స్వామిరాయుడు, ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.
ప్రజానీకాన్ని ఒక్కటి చేసిన దీక్ష..
నర్సంపేట: ఉద్యమ నేత కేసీఆర్ నాడు చేపట్టిన దీక్ష ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని టీఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని దీక్షాదివస్ ఒక్కటి చేసిందన్నారు. రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ నాడు పట్టుదలతో ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న నినాదంతో 2009 నవంబర్ 29న ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని వివరించారు. అదే ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందన్నారు. తదనంతరం జరిగిన ఉద్యమ పరిణామాలతో ఆరు దశాబ్దాల కల అయిన తెలంగాణ రాష్ర్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, దార్ల రమాదేవి, కస్టర్ ఇన్‌చార్జ్‌లు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణం..
నల్లబెల్లి: నాటి దీక్ష ఫలితమే నేటి బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేశాయని టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్ అన్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ దీక్ష చేపట్టి నేటికి 13 ఏళ్లు పూర్తయిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపెల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జిలు ఎం మోహన్‌రెడ్డి, ఈ శివాజీ, మాలోత్ ప్రతాప్‌సింగ్, సర్పంచ్‌లు మామిండ్ల మోహన్‌రెడ్డి, సిద్దూరి రత్నాకర్‌రావు, ఊరటి అమరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ జన్ను జయరావు, అబ్జర్వర్ ఆకుల సాంబారావు, క్యాతం శ్రీనివాస్, వైనాల వీరస్వామి, గోనెల నరహరి, పాండవుల రాంబాబు, నాగెల్లి శ్రీనివాస్, సుభాష్, బాలరాజు, హరీశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
దుగ్గొండి: మండలకేంద్రంలోని గిర్నిబావిలో దీక్షాదివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల చేతిలో ఆగమవుతున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నాడు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. ఆయన పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా, దాన్ని బంగారు తెలంగాణగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఓడేటి తిరుపతిరెడ్డి, ఊరటి మహిపాల్‌రెడ్డి, బుస్సాని రమేశ్, శ్రీనివాస్, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్
చెన్నారావుపేట: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. దీక్షాదివస్ సందర్భంగా మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక మహా ఘట్టమని వివరించారు. ఇప్పుడు యావత్ భారత దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పానికి తామంతా ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. దేశ ప్రజలు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కందకట్ల సాంబయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.