హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. జాబితా నుంచి తొలగించేందుకు లేదా సవరించేందుకు అధికారులు ఇప్పటికే సుమారు 13.34 లక్షల మంది ఓటర్లను గుర్తించారు. వీరిలో మరణించినవారు 4,64,210 మంది, చిరునామా, అందుబాటులో లేనివారు 53,324 మంది, శాశ్వతం గా వలస వెళ్లినవారు 6,39,503 మంది, ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లుగా నమోదైనవారు 1,73,115 మంది, వివిధ కారణాలతో మరికొంత మంది ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కార్యాలయం తమ డ్యాష్ బోర్డులో వెల్లడించింది. నకిలీ, అనుమానాస్పద ఓట్లను తొలగించే ప్రక్రియలో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఏఎస్డీ) క్యాటగిరీ కింద 1,54,907 (0.46 శాతం) మందిని, ఒకే విధమైన ఫొటోలు లేదా వివరా లు ఉన్న (డీఎస్సీ) 1,79,462 (0.53 శాతం) మందిని గుర్తించారు. ఇందులో 12, 153 (0.04 శాతం) ఓటర్ల వివరాలను సేకరించడానికి వీల్లేనివిగా మార్ చేశారు. 16, 684 (0.05 శాతం) ఓటర్ల విషయంలో ఎ లాంటి చర్యలు అవసరం లేదని ధ్రువీకరించారు.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఈఎఫ్‌ల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల సవరణ ఫారమ్‌ల పంపిణీ దాదాపు వంద శాతం పూర్తయింది. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 3,38,26,436 మందికి ఈఎఫ్‌లను పంపిణీ చేశారు. ఓటర్ల సమాచారాన్ని ఆన్లైన్లో భద్రపరిచే డిజిటలైజేషన్ ప్రక్రియ 63.30% మేరకు పూర్తయింది. మొత్తం 3.38 కోట్ల ఓటర్లలో ఇప్పటివరకు 2,14,13,166 మంది ఓటర్ల డాటాను డిజిటలైజ్ చేశారు. ఇంకా 1,18,39,042 (35.00%) ఈఎఫ్‌లు డిజిటలైజ్ కావాల్సి ఉన్నది. 9,48,871 (2.81%) మంది ఓటర్లు నేరుగా ఆన్లైన్లో ఈఎఫ్‌లు సమర్పించారు. జిల్లాలవారీగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 87.91% డిజిటలైజేషన్‌తో అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట (82.97%), నల్లగొండ (82.05%), రాజన్న సిరిసిల్ల (80.31%), కుమ్రంభీం ఆసిఫాబాద్ (80.80%) జిల్లాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు ఎకువగా ఉన్న జిల్లాల్లో ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతున్నది. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కేవలం 34.67% డిజిటలైజేషన్‌తో చివరి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ జిల్లాలో 37.50%, రంగారెడ్డి జిల్లాలో 46.25% ఈఎఫ్‌లు డిజిటలైజ్ అయ్యాయి.
