నర్సంపేట/నల్లబెల్లి/కురవి, డిసెంబర్ 6: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట పర్యటనకు వచ్చిన మరుసటి రోజు నుంచే రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. వానకాలంలో యూరియా కోసం అష్టకష్టాలు పడిన రైతాంగానికి ఈ యాసంగిలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. శనివారం ఖానాపురం మండలం ధర్మారావుపేట రైతువేదిక వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన మహిళా రైతులు చలికి వణుకుతూ నానాఇబ్బంది పడ్డారు. ధర్మారావుపేటతోపాటు చుట్టుపక్కల గ్రామాలు, శివారు పల్లెలు, తండాలకు చెందిన వందలాది మంది రైతులు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. భోజనం లేకున్నా మహిళా రైతులు క్యూలో నిలబడ్డారు. ఉదయం 9గంటలకు వ్యవసాయ, సొసైటీ అధికారులు, సిబ్బంది రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆధార్‌కార్డులు, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్‌ల ఆధారంగా రైతులకు టోకెన్లు అందించారు.
ఈ క్రమంలో క్యూలో స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. నర్సంపేట మండలం గురిజాల సొసైటీ ఎదుట రైతులు యూరియా కోసం క్యూకట్టి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలావుండగా నల్లబెల్లి మండల కేంద్రం, గుండ్లపహాడ్‌లోని సొసైటీలకు 70 టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. రైతుల అవసరాలకు సరిపడా రాకపోవడంతో ఒక్కో రైతుకు ఒకే బస్తా చొప్పున పంపిణీ చేశారు. వారం రోజుల క్రి తం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద అధికారులు ఇచ్చిన రసీదులు పట్టుకుని వారం రో జులుగా పీఏసీఎస్ గోదాముల చుట్టూ తిరుగుతున్నా యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ యూరియా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని సొసైటీ వద్ద సైతం రైతు లు బారులుతీరారు. 666 బస్తాల యూరియా రాగా ఎకరం ఉన్న రైతులకు ఒక్కో బస్తా, మిగతా వారికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఈ-పాస్ మెషీన్ మొరాయించడంతో కొదిసేపు అంతరాయం కలిగింది. ప్రజాప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ యూరియా పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.