గూడూరు, ఫిబ్రవరి 9 : ‘మిమ్మల్ని చూసేందుకు చావడానికైనా సిద్ధమే సార్’ అంటూ ఓ దివ్యాంగుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేటీఆర్‌ను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు. గమనించిన కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపి దివ్యాంగుడితో మాట్లాడారు. ఈ ఆసక్తికర ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నుంచి నర్సంపేట మీదుగా మహబూబాబాద్‌కు కేటీఆర్ వెళ్తున్న విషయం తెలుసుకున్న గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెందిన దివ్యాంగ యువకుడు ధరావత్ వినోద్ గూడూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంతంలో కేటీఆర్‌ను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు.
ఇది గమనించిన కేటీఆర్ తన వాహనాన్ని ఆపి అలా పరుగెడితే వాహనం కింద పడిపోతావు అని సర్దిచెప్పారు. వినోద్ మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూసేందుకు చావడానికైనా సిద్ధమే సార్’ అని చెప్పాడు. వెంటనే కేటీఆర్ ఆ యువకుడిని టీస్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇచ్చి వివరాలు తెలుసుకున్నారు. ‘నీ వయసెంత? ఏం చదువుకున్నావు?’ అని అడుగగా 30 ఏండ్లు ఉంటాయని, డిగ్రీ సెకండియర్ చదివానని, ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేదని చెప్పాడు. తనకు బీఆర్ఎస్ హయాం నుంచి వస్తున్న రూ.4 వేల పింఛనే ఆధారమని తెలిపాడు. ఇప్పుడేం చేస్తావో చెప్పు అని కేటీఆర్ అడగడంతో తనకు కిరాణం నడుపుకొనేందుకు ఆర్థికసాయం కావాలని వినోద్ కోరాడు. వెంటనే రూ.2 లక్షల చెక్కును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మండలాధ్యక్షుడు వేం వెంకటకృష్ణారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ శైలజా మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తానని చెప్పిన కేటీఆర్, షాపు ఓపెనింగ్‌కు తనను పిలువాలని కోరారు. దీంతో ఆ యువకుడు కేటీఆర్‌కు చేతులెత్తి మొక్కుతూ తప్పకుండా పిలుస్తానని తెలిపాడు. కాగా హామీ మేరకు వినోద్‌కు ఇవ్వాలని చెక్కును భరత్‌కుమార్‌రెడ్డికి కేటీఆర్ అందించారు.