హైదరాబాద్, నవంబర్8(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలోని ఓ అమాత్యుడిపై గుస్సా అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఇంటికి పిలుపించుకొని మరీ ఆ మంత్రికి తలంటినట్టు తెలిసిం ది. ప్రభుత్వంలో మంత్రివై ఉండి మీరు చేస్తు న్న పని ఏమిటని నిలదీసినట్టు సమాచారం. ఈ ఘటనతో నివ్వెరపోయిన ఆ మంత్రి అలి గి నొచ్చుకున్నట్టు సమాచారం. రేవంత్‌కు ఇంతగా కోపం తెప్పించిన ఆ విషయం ఏమిటని ఆరా తీస్తే.. ఎన్నికల ఫలితాలపై విడుదలైన ఓ సర్వే అంశమని తేలింది. ఇటీవల కేకే జాతీయ సర్వే సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సర్వే ఫలితాలు విడుదల చేసింది.
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువబోతుందని, ఆ పార్టీకి అత్యధికంగా 55.2% ఓటు షేర్ ఉన్నదని, కాంగ్రెస్ 37.8% వద్దే ఆగిపోయిందని తేల్చిచెప్పింది. ఒక్కో డివిజన్లో ఏ పార్టీకి ఎంత ఓటు శాతం వస్తుందని కూడా ఆ సర్వే నిర్వాహకుడు కేకే వివరించారు. ఆ సర్వే ఫలితాలను అన్ని తెలుగు మీడియా హౌజ్‌లు ప్రాముఖ్యత ఇచ్చి ప్రసారం చేశాయి. ఇవే ఫలితాలను ఒక మంత్రికి చెందిన మీడియా హౌజ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తేల్చిన ఆ సర్వే వివరాలను ఆయా మీడియా సంస్థలు వారి సమయ లభ్యతను అనుకరించి 5-10 నిమిషాల్లో ముగించగా, మంత్రి మీడియా చానల్ దాదాపు 20 నిమిషాలపాటు లైవ్ ప్రసారం చేసిందని సమాచారం.
ఆ మంత్రిపై సీఎంకు చిర్రెత్తుకొచ్చిందా?
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండగా వచ్చిన ఆ సర్వే సరళిని సీఎం కూడా పరిశీలించారు. ఆ ప్రసార ఫలితాలను చూసి తల పక్కకు తిప్పుకున్నట్టు తెలిసింది. సమయం గడుస్తున్నాకొద్దీ అన్ని టీవీలు ఆ ప్రసారాన్ని మార్చినా, మంత్రి గారి చానల్ మాత్రం అదే పనిగా ఏకధాటి ప్రసారం చేసిందని తెలిసి సీఎంకు చిర్రెత్తుకొచ్చిందంట. దీంతో తెల్లారేసరికి సదరు మంత్రిని పిలిచి ‘ఆ సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్తుంటే మీ చానల్ అదే పనిగా ప్రసారం చేయడం ఏమిటి? అని సీఎం నిలదీశారని తెలిసింది. మంత్రి ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా విననట్టు తెలిసింది. సీఎం మాటలతో చిన్నబుచ్చుకున్న ఆ మంత్రి అలిగి వెళ్లిపోయినట్టు సమాచారం. అప్పటి నుంచే ఆయన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారని తెలిసింది.