Congress Party | నర్సాపూర్, మార్చి 27: నర్సాపూర్ కాంగ్రెస్‌లో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్ మధ్య లుకలుకలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్టీ గ్రామ అధ్యక్షుడిపై కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన మధుగౌడ్‌ను నూతనంగా కాంగ్రెస్‌లోకి వచ్చిన కార్యకర్తలు అక్రమంగా అరెస్ట్ చేయించారు.
ఈ సందర్భంగా మధుగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిన్నచింతకుంటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో వేయలేదన్నారు. ఇదే విషయాన్ని పార్టీ మండల అధ్యక్షుడి దృష్టికి తీసుకుపోగా అదే గ్రామానికి చెందిన కొందరు కార్యకర్తలు ఫ్లెక్సీని చింపివేసి తనపై అక్రమంగా కేసు పెట్టారని మధుగౌడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు తనను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఫ్లెక్సీ ఎందుకు చింపావని, వారి దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాత్రి 8.30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి రాత్రి 12 గంటలకు వదిలిపెట్టారని తెలిపారు. 15 ఏండ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నానని, ఫ్లెక్సీని ఎందుకు చింపుతానని ఆవేదన వ్యక్తం చేశాడు. సీనియర్ నాయకులపై ఇలాంటి అక్రమ కేసులు పెట్టకుండా చూడాలని కాంగ్రెస్ నియోజకవర్గ, రాష్ట్ర నాయకులను కోరారు. సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం ఏమిటని పలువురు చర్చించుకున్నారు.