Pre Diabetes Symptoms | జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా మనలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఊబకాయం వంటి వివిధ కారణాల వల్ల మనలో చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులను ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోజువారి అలసట, ఉద్యోగ ఒత్తిడి వంటి కారణాల వల్ల పురుషులు దీని బారిన ఎక్కువ పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం కావడంతోపాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని వారు తెలియజేస్తున్నారు. డయాబెటిస్ ను ముందుగా గుర్తించడంద్వారా దానిని నివారించడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రారంభ సంకేతాలతో పాటు శరీరంలో కనిపించే మార్పులను గుర్తించడం వల్ల రోగనిర్దారణ త్వరగా చేయడంతో పాటు మెరుగైన చికిత్సను తీసుకునే వీలు ఉంటుంది. డయాబెటిస్ వ్యాధి బారిన పడినప్పుడు మనలో కనిపించే ప్రారంభ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలో అదనంగా ఉండే గ్లూకోజ్ మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువగా ఉండేలా చేస్తుంది. దీంతో మూత్రం ఎక్కువగా తయారవుతుంది. మనం తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి సమయంలో మూత్ర విసర్జన మరింత ఎక్కువగా ఉంటుంది. అధికంగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో దాహం ఎక్కువ అవుతుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ డయాబెటిస్ ఉన్న వారిలో నిరంతరం అలసటగా ఉంటుంది. శరీర కణాలు శక్తి కోసం గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడం వల్ల శక్తి కోసం కండరాలు కొవ్వును విచ్చినం చేయడం ప్రారంభిస్తాయి. దీంతో శరీర బరువు తగ్గుతుంది. కడుపు నిండా తిన్న తరువాత ఆకలి ఎక్కువగా అవుతుంది. డయాబెటిస్ ను సూచించే లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా కంటి చూపు మసకబారినట్టుగా కనిపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయం అవుతాయి. మధుమేహం కారణంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో చేతులు, కాళ్లల్లో తిమ్మిర్లు రావడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. డయాబెటిస్ కారణంగా అంతర్గత అవయవాలతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.