అమరచింత, ఫిబ్రవరి 14 : వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమికి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అయూబ్‌ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణు, మైనార్టీ సెల్ అమరచింత అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ కారణమని అమరచింత మున్సిపల్ 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తౌఫిక్ ఆరోపించాడు. ఎన్నికల సమయంలో స్థానిక షాదీఖానాలో మైనార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించడంతో తనకు ఓట్లు పడలేదని, ఈ విషయమై మంత్రి శ్రీహరితోపాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా టీపీపీసీ కల్లుగీత కార్మిక సెల్ రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్ నివాసం ఉండే వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లింగమ్మ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత బీజీపీ, కాంగ్రెస్ వర్గాలు గొడవకు దిగాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఎస్సై స్వాతి సిబ్బందితో చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.