Telangana | రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు( Welfare Hostel Students ) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించే అవకాశం ఉంది. విద్యార్థుల డైట్ ఛార్జీలు(Diet Charges ) గణనీయంగా 25 శాతం పెంచాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కు పంపింది. ఇక సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే మిగిలింది. కేసీఆర్ ఆమోద ముద్ర వేస్తే 3,214 సంక్షేమ హాస్టళ్లలోని 8.59 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
విద్యార్థుల డైట్ ఛార్జీలపై కేబినెట్ సబ్ కమిటీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు( Minister Harish Rao ) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి బీసీ వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ఆ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు సార్లు డైట్ ఛార్జీలు పెంచింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కంటే అధికంగా తెలంగాణలో మెస్ ఛార్జీలు ఉన్నాయని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది.
డైట్ ఛార్జీలను 25 శాతం పెంచితే రాష్ట్ర ఖజానాపై అదనంగా ప్రతి నెల రూ. 275 కోట్లు, ప్రతి సంవత్సరానికి రూ. 3,302 కోట్ల భారం పడనుంది. 3 నుంచి 7 తరగతులకు రూ. 1200, 8 నుంచి 10 తరగతులకు రూ. 1400, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ. 1875లు ప్రతి నెల ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు 3 నుంచి 7 తరగతులకు రూ. 950, 8 నుంచి 10 తరగతులకు రూ. 1100, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ. 1500 డైట్ ఛార్జీలు ఉన్నాయి.