ఈయన పేరు చెవుల భాస్కర్. హుజూరాబాద్ మండలం రంగాపూర్ స్వగ్రామం. వరికోతల సీజన్లో హార్వెస్టర్ నడుపుతుంటాడు. రోజుకు 80 లీటర్ల చొప్పున డీజిల్ ఉంటేనే పొద్దంతా హార్వెస్టర్ నడుస్తుంది. రెండు రోజుల నుంచి పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగినా 10 లీటర్ల డీజిల్ కూడా దొరుకలేదు. వేరే దిక్కులేక ఆ హార్వెస్టర్‌ను పక్కకు పెట్టాడు. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా నడుస్తుండగా, ఈ నెల రోజులు 24 గంటలపాటు పని ఉంటుంది. అలా పనిచేస్తేనే తీసుకున్న రుణానికి కిస్తీలు చెల్లించే పరిస్థితి ఉంటుంది.
కానీ, అకస్మాత్తుగా డీజిల్ కొరత ఏర్పడటంతో అది నడువకుండా అయింది. ఇది భాస్కర్ ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. హార్వెస్టర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎంతోమంది దుస్థితి. ఈ పరిస్థితి నుంచి బయటపడకపోతే కిస్తీలు చెల్లించడం కష్టమవుతుంది. అంతేకాదు, సకాలంలో వరి కోతలు పూర్తి చేయకపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. రాళ్ల వర్షం కురిస్తే ఒక్క గింజ చేతికి రాదు. ఆరుగాలం రైతులు పడిన శ్రమంతా నేలపాలవుతుంది. వ్యవసాయ రంగానికి వినియోగించే హార్వెస్టర్లు, లేదా ట్రాక్టర్లకు ప్రత్యేక కోటా పెట్టాలని, డీజిల్, పెట్రోల్ వంటి వాటికి కొరత లేకుండా చూడాలని భాస్కర్ కోరుతున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో ఏర్పడిన డీజిల్, పెట్రోల్ కొరత వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రస్తుతం వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నెలపాటు కోతలుంటాయి. ఇక్కడ ఉన్న హార్వెస్టర్లు సరిపోక చాలా మంది వ్యాపారులు సైతం మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి అద్దెకు తెచ్చి నడుపుతున్నారు. అయినా వరి కోతలకు అవి సరిపోవడం లేదు. దాదాపు ఒకే దశలో వరి కోతకు రావడంతో రైతులు తొందర పడుతుంటారు. వ్యవసాయరంగానికి అనుసంధానమైన హార్వెస్టర్లతోపాటు ట్రాక్టర్లను డీజిల్ కొరత వెంటాడటం వల్ల ఆ ప్రభావం రైతులపై పడుతుంది. నిజానికి ఒక హార్వెస్టర్ వరి కోస్తుంటే.. ఆ వెంటనే ట్రాక్టర్ పనిచేయాల్సి ఉంటుంది. హార్వెస్టర్ ద్వారా వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే బయటకు పంపడానికి ట్రాక్టర్‌ను వినియోగిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి నూటికి 99 శాతం మంది రైతులు ట్రాక్టర్లనే వినియోగిస్తారు. వీటికి సరిపడా డీజిల్ అవసరం. అది ఉన్నప్పుడే హార్వెస్టర్లతోపాటు ట్రాక్టర్లు సజావుగా నడుస్తాయి. ప్రస్తుతం తలెత్తిన డీజిల్ సంక్షోభం ఇప్పుడు హార్వెస్టర్లకు, ట్రాక్టర్లకు శరాఘాతంగా మారుతుండగా, ఈ ప్రభావం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే దశలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుండగా, వాతావరణ శాఖ కూడా వర్షం హెచ్చరికలు చేస్తున్నది. డీజిల్ లభ్యం కాక కోతలు ఆలస్యమయ్యే పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం అన్నదాత పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వడగండ్ల వర్షాలు భారీగా పడే ముప్పు ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే జరిగితే ఆరుగాలం పండించిన పంటలు చేతికందకుండానే పోయే ప్రమాదం ఉంటుందని రైతులు చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్న రైతులతోపాటు హార్వెస్టర్ల, ట్రాక్టర్ల యాజమాన్యాలు వేడుకొంటున్నాయి.