హైదరాబాద్: కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. అది జనజాతర సభ కాదని, హామీల పాతర.. అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరిట గారడి చేసిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్ ఎలక్షన్లలో న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని ఎక్స్ వేదికగా నిలదీశారు.
నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలుగా నయవంచన చేస్తున్నదని విమర్శించారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తున్నదని, నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతున్నదని ఆరోపించారు. గ్యారెంటీలకు పాతరేసి, అసత్యాలతో జాతర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని చెప్పారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారని, తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని పేర్కొన్నారు.
రాహుల్ గారు.. మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా?, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా, 200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా?, చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా?, డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే నిండా మునగడం ఖాయమని తేలిపోయిందని చెప్పారు. అందుకే వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయమన్నారు.
అది జనజాతర సభ కాదు…
హామీల పాతర… అబద్ధాల జాతర సభ..రాహుల్ గాంధీ గారు…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..!పార్లమెంట్ ఎలక్షన్లలో..
న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..?తెలంగాణకు తీరని అన్యాయం చేసి..
ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ??… https://t.co/bQk4H9XmaM— KTR (@KTRBRS) April 7, 2024