హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘దివాలా తీసిన కంపెనీగా సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు రాష్ట్ర సర్కారు సుమారు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడంలో అంతర్యమేమిటి? సస్పెన్షన్ వేటు పడ్డ వ్యక్తి డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆ సంస్థపై సీఎం రేవంత్‌రెడ్డికి అంత ప్రేమ ఎందుకు?’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. గతంలో సీఎంకు ల్యాండ్ క్రూజర్ కారు ఇచ్చినందుకే ఇప్పుడు ఆ సంస్థకు కాంట్రాక్టుల రూపంలో బహుమతి ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 14న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్పై నమోదైన ఇన్సాల్వెన్సీ, దివాలా కేసులను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని గుర్తుచేశారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా.. ట్రిబ్యునల్‌లోని ఒక జడ్జిపై ఒత్తిడి తేవడంతో ఆయన కేసు నుంచి తప్పుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సదరు జడ్జిపై ఒత్తిడి తెచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. గతంలో ఈ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిన సందర్భంలో రేవంత్‌రెడ్డి బినామీగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి తీవ్రమైన కేసులు, ఆరోపణలు ఉన్న సంస్థకు వరుసగా కాంట్రాక్టులను అప్పగించడం దురదృష్టకరమని అన్నారు. రెండేండ్లు కూడా నిండకముందే ప్రభుత్వం ప్రజల సొమ్మును అప్పనంగా కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
దివాలా తీసినట్టు కేసులున్న సంస్థకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టులు ఇవ్వడం చట్టవిరుద్ధమని క్రిశాంక్ పేర్కొన్నారు. ‘గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ నిర్మాణానికి రూ.145 కోట్లు, వికారాబాద్ రోడ్ల నిర్మాణానికి రూ.185 కోట్లు, బషీరాబాద్ నుంచి మైలావర్ వరకు రహదారి నిర్మాణానికి రూ.116 కోట్లు, పాలేరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించి రూ.191 కోట్లు, రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సూర్యాపేటకు రూ.319 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ పైప్‌లైన్ రిమైనింగ్ వర్క్స్‌కు రూ.168 కోట్లు’ ఇలా ఆ సంస్థకు సుమారు వెయ్యి కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను వరుసగా ఇవ్వడం వెనుక మర్మమేంటని ప్రశ్నించారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను సైతం అప్పగించినట్టు తెలిసిందని చెప్పారు.
ఎందరో సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, కళాకారులు గౌరవం పొందే ప్రదేశం, తెలంగాణ సాం స్కృతిక చిహ్నమైన రవీంద్రభారతిపై రేవంత్‌రెడ్డికి చిన్నచూపు ఎందుకని క్రిశాంక్ ప్రశ్నించారు. రామోజీపై ప్రేమ ఉంటే ఎంత పొగిడినా తప్పులేదని అన్నారు. కానీ కళారూపాల ప్రదర్శనకు నిలయమైన రవీంద్రభారతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆక్షేపించారు. వెంటనే రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ కళాకారులు, సాహితీవేత్తల నుంచి ప్రతిఘటన ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు కాంట్రాక్ట్‌ల అప్పగింతపై సంబంధిత శాఖల అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం దురదృష్టకరమని క్రిశాంక్ వాపోయారు. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. ఎలాంటి తప్పిదాలు లేకుంటే, చట్టవిరుద్ధం కాకుంటే గోప్యత ఎందుకు పాటిస్తున్నారని నిలదీశారు. అధికారుల వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. గతంలో ల్యాండ్ క్రూజర్ కారు ఇచ్చినందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కాంట్రాక్టులు అప్పగించారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి కేఎల్ఎస్ఆర్ ఇ చ్చిన కారుపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణల తరువాత.. ఇటీవలే ఆయన సోదరుడు కొండాల్రె డ్డి పేరిట వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్‌లు, వాహనం రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో సర్కారు వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.