Diarrhoea | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో అతిసార(డయేరియా) కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పలు దవాఖానలకు పరుగులు పెడుతున్నారు. సిటీలోని ఫీవర్ దవాఖానకు రోజుకు 30 మంది బాధితులు వస్తున్నారు. వీరిలో రోజుకు ఆరుగురు అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం దవాఖానలో 21మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో డయేరియాకు దారి తీసే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండలు ముదరడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో భూగర్భ జలాలు 1.44 మీటర్ల మేరకు తగ్గిపోయినట్టు నిపుణులు చెప్తున్నారు. జలవనరుల్లో నీటి నిల్వలు లేకపోవడం, భూగర్భజలాలు పడిపోవడంతో తాగునీరు కలుషితమవుతున్నట్టు వెల్లడించారు. రోజూ 4 లీటర్ల నీటిని తాగితే డయేరియా బారినపడకుండా ఉండవచ్చని ఫీవర్ దవాఖాన జనరల్ ఫిజీషియన్ విజయ్ సూచించారు.