హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): దూరాభారమైన హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, పేదల చెంతకే డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటుచేసిన 102 డయాలసిస్ కేంద్రాల్లో సేవలందుతున్నాయని, ఇవి కిడ్నీ బాధితులకు వరంలా మారాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. నాడు కిడ్నీ బాధితులు వ్యయప్రయాసలు, తిండి తిప్పలకు ఓర్చుకొని హైదరాబాద్ దాకా వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు.
నేడు స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులకు సీఎం కేసీఆర్ చరమగీతం పాడారని చెప్పారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యశాలలకే పరిమితమైన డయాలసిస్ సేవలను ఏకంగా 102కు పెంచి సేవలను విస్తృతం చేశారని కొనియాడారు. సిర్పూర్ కాగజ్‌నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పడానికి గర్వంగా ఉన్నదని అన్నారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలో తొలిసారి సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతిని అనుసరిస్తున్నట్టు చెప్పారు. పేషెంట్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్‌పాస్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు.