హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): శరీరాన్ని నిర్వీర్యం చేసే మధుమేహ (డయాబెటిస్) వ్యాధి ఇప్పుడు యువతను సైతం పీడిస్తున్నది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని, వారిలో ఎంతో మంది యువత ఉన్నారని హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ దవాఖాన వైద్యులు తెలిపారు. ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలిలో ఎలాంటి మార్పులు లేకపోవడం తదితర అంశాలు డయాబెటిస్‌కు కారణమని తాజా నివేదికలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వయోజనులంతా తరచుగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. వ్యాయామంతోపాటు జీవనశైలిని మార్చుకోవడం, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, రోజూ కనీసం 7-9 గంటలపాటు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా మధుమేహాన్ని నిరోధించవచ్చని కిమ్స్ వైద్యుడు డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి తెలిపారు.