మహబూబాబాద్ రూరల్, నవంబర్ 18 : లగచర్ల ఘటన, గిరిజన సమస్యలు, ఎన్నికల హామీలను అమలు చేయాలని గిరిజన రైతుల కోరిక మేరకు ఈ నెల 20న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 15 వేల మంది రైతులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, బానోతు శంకర్‌నాయక్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్‌లోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి లంబాడా ఓట్లు కావాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి వారిని అణచివేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత ప్రయోజనం కోసమే కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా కంపెనీ పెడుతున్నారని ఆరోపించారు. ఈ కంపెనీ కోసం సుమారు 4 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఇందులో అమాయక, పేద గిరిజనుల భూములను ప్రభుత్వం లాక్కొనే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా వే ములవాడ డివిజన్ పరిధిలోని రుద్రంగిలో నూతనంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్థానికంగా సాంకేతిక నైపుణ్య శిక్షణ పొందేందుకు తమకు ఎటువంటి శిక్షణా కేంద్రం లేనందున ఏటీసీ ఏర్పాటు చేయాలన్న స్థానికుల విజ్ఞప్తి మేరకు రుద్రంగిలోని సర్వే నంబర్- 428లోగల ప్రభుత్వ స్థలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒక్కో కోర్సులో 20 నుంచి 48 వరకు సీట్లతో మొత్తం 244 సీట్లు ఉంటాయని వివరించారు.