ఆమనగల్లు, అక్టోబర్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఆర్ నూతన అలైన్మెంట్తో చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని సీపీఎం నాయకుడు కానుగుల వెంకటయ్య మండిపడ్డారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఏర్పాటు చేసిన భూ నిర్వాసితుల పోరాట కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
ట్రిపుల్ ఆర్ నిర్మాణంపై ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించకుండా బలవంతంగా భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 2013-భూ సేకరణ చట్టంపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ రైతులపై తక్కువ ప్రభావం చూపగా, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కొత్త అలైన్మెంట్ బడానాయకులకు అనుకూలంగా, చిన్న సన్నకారు రైతులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రామసభలు నిర్వహించిన తర్వాతే భూసేకరణ జరగాలని, బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న సీపీఎం ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట చేపట్టే రీజినల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.