మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జడ్చర్ల, ఆగస్టు 26: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన రైతు ఇస్లావత్ రవినాయక్ అప్పులబాధతో సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం రవిమృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ముదిరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారిపై కుటుంబసభ్యులు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు.
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవినాయక్ భౌతికకాయానికి.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అప్పులబాధతో పురుగుమందు తాగిన రవినాయక్‌ను చికిత్స కోసం జడ్చర్ల దవాఖానకు తరలిస్త్తే.. అక్కడ సిబ్బంది లేరని, మహబూబ్‌నగర్‌కు పంపారని అక్కడా వైద్యులు అందుబాటులో లేరని హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినట్టు చెప్పారు.
అక్కడ కూడా డాక్టర్లు నిర్లక్ష్యం చేయడంతో గంట తర్వాత గాంధీ దవాఖానకు తీసుకెళ్తే అప్పటికే రవినాయక్ మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారని చెప్పారు. జడ్చర్ల 100 పడకల దవాఖానలో సిబ్బంది ఉండి, సకాలంలో వైద్యం అందిస్తే రవినాయక్ బతికే వాడని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.