నాగర్‌కర్నూల్ టౌన్, ఏప్రిల్ 15 : నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూలు కస్తూర్బా విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేస్తేనే తాము భోజనం చేస్తామని మండుటెండలో భీష్మించుకుని కూర్చొన్నారు. పది రోజుల క్రితం ఉపాధ్యాయురాలి తీరుతో మనస్తాపం చెందిన 9వ తరగతి విద్యార్థి చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. పదిరోజులైనా సదరు టీచర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. టీచర్ తమని టార్చర్ చేస్తున్నదని, స్నానం చేస్తుంటే ఫొటోలు తీసి ఎవరెవరికో షేర్ చేస్తున్నదని వాపోయారు. టీచర్‌పై చర్యలు తీసుకుంటామని డీఈవో రమేశ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.