కరీంనగర్ తెలంగాణచౌక్ ; రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి గనులను వేలం వేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటంరాజ్ మండిపడ్డారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా గనుల ప్రైవేటీకరణ జరగడం సిగ్గుచేటన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కోతిరాంపూర్ గాంధీ విగ్రహం వద్ద ఆ సంఘం నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటంరాజ్ మాట్లాడుతూ.. సింగరేణి మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, ప్రైవేటీకరణతో వారంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
మూడు నెలలుగా జీతాలివ్వరా?
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం ఉదయం కరీంనగర్ దవాఖాన ఎదుట ధర్నా చేశారు. వరర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సంఘం గౌరవ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకో వారం గడిస్తే వేతనాలు రాక మూడు నెలలు అవుతుందని తెలిపారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించని పక్షంలో కలెక్టరేట్‌ను
ముట్టడిస్తామని హెచ్చరించారు. –
మెగా డీఎస్సీ వేయాలని బీజేవైఎం ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేయాలని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణనాయుడు, యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మధు డిమాండ్ చేశారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన తెలుపుతూ సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు నారాయణనాయుడు, మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా మెగా డీఎస్పీ వేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
‘పాఠశాల’ భూయజమానుల నిరసన
లింగంపేట, జూన్ 25 : ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి తమ భూమిని తీసుకున్న అధికారులు.. మరోచోట స్థలాన్ని కేటాయిస్తామని మాట తప్పడంపై బాధితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. ఉప్పరి మనెమ్మ, బర్ల భారతమ్మ, గంగామ ణి, కళావతి, అనుసమ్మ, దుర్గయ్యకు చెందిన 34 గుంటల స్థలాన్ని పాఠశాల నిర్మాణం కోసం ఇస్తే, మరోచోట ఐదు గుంటల భూమి ఇస్తామని అధికారులు హామీఇచ్చారు. అందుకు భూ యజమానులు భూమిస్తే ముప్పై ఏండ్ల క్రితం పాఠశాల నిర్మించారు. పక్కనే మరో స్థలం చూపిస్తే సాగుకు అనుకూలంగా లేదని రైతు లు తీసుకోలేదు. ఏండ్లు గడుస్తున్నా భూమి కేటాయించలేదు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బాధితులు మంగళవారం పాఠశాల ఆవరణలో వంటావార్పుతో నిరసన తెలిపారు.