కల్వకుర్తి రూరల్, నవంబర్ 4 : డబుల్ బెడ్రూం(Double bedroom houses) ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం లబ్ధిదారుల పోరాట సంఘం నాయకులు ఆంజనేయులు, నర్సింహ మాట్లాడుతూ.. కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి నాలుగేండ్లు అవుతున్నదని, లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి కూడా 18 నెలలు గడుస్తున్నదన్నారు.
నాలుగు నెలల కిందట అడిగితే విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలు లేవన్నారని, దీపావళి పండుగలోగా పట్టాలిస్తారనుకుంటే ఇవ్వకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. వేలకు వేలు అద్దెలు కట్టలేక సతమతమవుతున్నామని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు కేటాయించిన ఇండ్లకు పట్టాలిస్తే విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటామన్నారు. అనంతరం తాసీల్దార్ ఇబ్రహీంకు వినతిపత్రాన్ని అందజేశారు. వారంలోగా పట్టాలిస్తామని తాసీల్దార్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.