రాజన్న సిరిసిల్ల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా రిలేదీక్షలు చేపట్టిన సిరిసిల్ల జిల్లాలోని మాజీ సర్పంచులు సోమవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మొదట ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకొన్న పోలీసులు కలెక్టరేట్ గేట్లకు తాళం వేశారు. దీంతో మాజీ సర్పంచులు గేటు ఎదు ట బైఠాయించారు.
గంటకుపైగా ధర్నా చేశా రు. ప్లకార్డులు పట్టుకుని ‘రేవంత్ సర్కార్ డౌన్‌డౌన్’ అంటూ నినదించారు. గ్రామాభివృద్ధి కోసం తాము అప్పులు తెచ్చి పనులు చేసినా సర్కారు బిల్లులు ఇవ్వడం లేదని, తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఆందోళన చేస్తున్నామని వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదంటూ మొండికేశారు. కొందరు గేటు ఎక్కి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. బైఠాయించిన వారిని లాక్కెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. దాదాపు 60 మందిని అరెస్టు చేసి తాడూరులోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు తరలించారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు చెల్లించాలని సిరిసిల్లలో ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ ఖండించారు. బిల్లులు చెల్లించేదాకా పోరాటా న్ని ఆపబోమని తేల్చిచెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక యాదయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే సర్పంచుల బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, పదకొండు నెలలైనా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే డిసెంబర్లో కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేపడతామని హెచ్చరించారు.