రఘునాథపాలెం, అక్టోబర్ 16 : మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఎంఎల్ మాస్‌లైన్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, సీపీఎం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ మున్నేరు వరద ప్రవాహంతో ముంపు ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయారని తెలిపారు. అనేక ఇండ్లు కొట్టుకుపోయాయని, పలు ఇండ్లు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. వరదలు వచ్చి రెండునెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఏ మాత్రం ఆర్థికసాయం అందలేదని మండిపడ్డారు. కంటితుడుపు చర్యగా కొంతమందికి రూ.16,500 అకౌంట్లో జమ చేసి చేతులు దులుపుకొన్నట్టు విమర్శించారు. సర్వే చేసిన జాబితా గల్లంతు కావడంతో అర్హులైన వందల మంది నిరుపేద బాధితులకు పరిహారం నేటికీ అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.