కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కౌటాల, అక్టోబర్ 14: కేసీఆర్ సర్కారులో 24 గంటల కరెంట్‌తో రంది లేకుండా మిర్చి సాగు చేసి.. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం పొందిన రైతాంగం.. కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నది. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రాత్రింబవళ్లూ చేలవద్దే పడిగాపులు కాస్తున్నది. రోజూ నాలుగు గంటలపాటు కోతలు విధించడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించగా, కర్షకలోకం కన్నెర్ర చేసింది. ఈ మేరకు సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట గుండాయి సబ్‌స్టేషన్ పరిధిలో తాటిపల్లి, గుండాయిపేట్, గుడ్లబోరి, మొగఢ్దగఢ్ గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు ధర్నా చేశారు. కార్యాలయంలో అధికారులెవరూ లేకపోవడంతో గంటపాటు అక్కడ ఆందోళన చేసి.. ఆపై మార్కెట్ ఏరియాలోని ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ మరో మూడు గంటల పాటు ధర్నా చేశారు.
ప్రభుత్వం కరెంట్ కోతలు విధించడమేగాక ఆ ఇచ్చే కరెంట్ కూడా రాత్రి పూట సరఫరా చేయడం, అందులోనూ లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండటం వల్ల మోటర్లు కాలిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గుండాయిపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో బూస్టర్ చెడిపోయి ఏడాది కావస్తున్నా మరమ్మతులు చేయలేదని, అందువల్లే ఈ సమస్య తలెత్తిందని, తమ సమస్య తీరే వరకూ ధర్నా విరమించేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. రెండు రోజుల క్రితం గుండాయిపేట్కు చెందిన నాగుపురే పాండురంగ్ అనే రైతు మిర్చి పంటకు నీరు పెట్టేందుకు రాత్రి 12 గంటలకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడని, సకాలంలో దవాఖానకు తరలించడం వల్ల ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు.
విద్యుత్తు కనెక్షన్ల కోసం లక్షలాది రూపాయల డీడీలు కట్టించుకున్నారని, పంట పెట్టుబడి కోసం అనేక అప్పులు చేశామని, ఇప్పుడేమో అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక ఇండ్లకు సరఫరా చేసే కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉందని, దోమల బెడద ఎక్కువై అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధర్నాతో దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. విద్యుత్తు అధికారుల నుంచి లిఖిత పూర్వకంగా లేఖ రాసిస్తేనే ధర్నా విరమిస్తామని స్పష్టంచేశారు. చివరకు ఏఈ రవీందర్ అందుబాటులో లేకపోవడంతో మంగళవారం సమస్య పరిష్కరిస్తామని ఆయన వాట్సాప్ ద్వారా మెస్సేజ్ పంపడంతో రైతులు ధర్నా విరమించారు. విర్దండి, తుమ్డిహట్టి, పార్డీ, బాలెపల్లి తదితర గ్రామాల రైతులు, మాజీ ప్రజా ప్రతినిధులు మద్దతు పలికారు.
రాత్రి కరెంట్ కాడికి పోతే పాము కాటేసింది
నాకు ఐదెకరాల భూమి ఉంది. మిర ప సాగు చేస్తున్న. కాంగ్రెసోళ్లు కరెంటు సరిగా ఇవ్వడం లేదు. పంట ఎండిపోతుందని రెండు రోజుల కింద రాత్రి 12 గంటలకు కరెంట్ పెట్టడానికి పోయిన. అక్కడ పాము కాటేసింది. రాత్రి పూట కరెంట్ ఇవ్వడం వల్లే అనేక తిప్పలు పడుతున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కష్టాలు లేకుండే. కాంగ్రెసోళ్లు వచ్చిన్రు గోస పెడతున్రు.
– పాండ్‌రంగ్, గుండాయిపేట, రైతు
వారంలో రెండుసార్లు మోటర్ కాలింది
నాకు 5 ఎకరాల భూమి ఉంది. మిర్చి పంట వేసిన. కరెంటు సక్కగా లేక మోటర్, స్టార్టర్, వైర్ కాలిపోయాయి. మోటర్లు నడవాలంటే 240 వాట్లకు పైగా కరెంట్ ఉండాలి. కానీ మాకు 120-140 వాట్ల కరెంట్ వస్తుంది. ఇన్నిసార్లు మోటర్లకు ఖర్చు పెట్టే స్థోమత లేక బతుకుడా.. సచ్చుడా అర్థమైతలేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– దంద్రె ప్రవీణ్, రైతు, గుడ్లబోరి