డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో లబ్ధిదారుల పోరాట సంఘం నాయకులు ఆంజనేయులు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో విద్యా శాఖ చేపట్టిన అసంబద్ధ సర్దుబాటును వ్యతిరేకిస్తూ గంభీరావుపేట మండల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని మండల వనరుల కేంద్రం ఎదుట నిరసన తెలిపారు.
వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని సిరిసిల్ల నేతన్నలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించిన షెడ్లను ఇతరులకు కేటాయించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషం రమేశ్ డిమాండ్ చేశారు. దాదాపు వెయ్యి మంది కార్మికులను యజమానులుగా చేయాలన్న లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం షెడ్లను నిర్మించిందని గుర్తు చేశారు.
రా రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి అరెస్టుపై సిరిసిల్ల రైస్ మిల్లర్లు నిరసన తెలిపారు. సోమవారం రాత్రి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు ఆధ్వర్యంలో మిల్లర్లంతా కలెక్టరేట్ వద్దకు తరలివచ్చారు. అనంతరం అక్కడే ధర్నా చేశారు. రా రైస్ మిల్లర్ల సమస్యలు విన్నవించేందుకు ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లిన తమ రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నాగరాజు తెలిపారు.