‘ధరణి’ వందకు వందశాతం విజయవంతం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : భూ రికార్డుల నిర్వహణ, క్రమవిక్రయాలు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వందకు వందశాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలుకు మరింత వెసులుబాటు కల్పించేలా పోర్టల్‌లో అవసరమైన మార్పులను వారంరోజుల్లోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పలుశాఖలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖపై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా సత్వరం పరిష్కరించాలని చెప్పారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూములకు వెంటనే మ్యుటేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వారంలోగా పూర్తి చేయాలన్నారు.
‘ఎన్నారైలు తమ పాస్‌పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు పాస్‌బుక్ పొందేలా ధరణిలో వెసులుబాటు కల్పించాలి. గతంలో ఆధార్ నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు. అలాంటి వారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్స్ వివాదాలన్నింటినీ కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు తమ బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి, రీ షెడ్యూల్ చేసుకోవడానికి ధరణిలోనే అవకాశం కల్పించాలి. నిషేధిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు సవరించాలి. కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలి.
ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. కోర్టు కేసులు మినహా పార్ట్ – బీలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలి. ధరణి పోర్టల్ లో జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రిబ్యునల్ లో ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదు. కలెక్టర్లే అన్ని విషయాలను స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.
పాఠశాలలను తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి..
ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది నుంచి ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులను నిర్వహించాలని సూచించారు. నెలాఖరు నాటికి విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను తెరిచేందుకు సిద్ధం చేయాలన్నారు. పాఠశాలలన్నీ పరిశుభ్రంగా ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామగ్రి స్టాక్‌ను జాగ్రత్తగా సరి చూసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్‌లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్‌పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం