Congress | రైతు మెడపై రెండు కత్తులు పెట్టింది కాంగ్రెస్. ధరణి ఎత్తివేసి డిజిటల్ భూ రికార్డులను తిరిగి పాతపద్ధతిలోకి మారుస్తానని ప్రకటించింది. కౌలుదారుల కాలమ్‌ను చేర్చి రైతుకూ, అనుభవదారుకూ మధ్య పేచీ పెట్టనున్నది. మరోవైపు 10హెచ్‌పీ మోటర్లతో సాగుదారుల నెత్తిన మోయలేనంత భారం మోపనున్నది.
పటేల్ పట్వారీ వ్యవస్థ.. ఆ తర్వాత వచ్చిన రెవెన్యూ వ్యవస్థలో రైతుల తలరాతలే తలకిందులయ్యాయి. చేతిరాత రికార్డులు.. పదుల సంఖ్యలో కాలమ్స్‌తో అధికారులు రాసిందే భూమి.. చెప్పిందే లెక్కగా ఉండేది. దీంతో రాత్రి రాత్రే కౌలుదారు యజమాని అయ్యేవాడు. తన భూమి పోయిన సంగతికూడా రైతుకు తెలిసేది కాదు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మళ్లీ ఆ పాత ‘కాలమ్’ వస్తుంది.
కౌలుదారు కాలమ్లాంటి కొత్త కొర్రీలతో రైతు భూమి ఆగమవుతుంది. తమ సొంత భూమిపై హక్కులకోసం అన్నదాతలు కాంగ్రెస్ హయాంలో ఎలాగైతే రెవెన్యూ అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగారో మళ్లీ అదేరోజులు వస్తాయి. రాతపుస్తకాలతో అన్నదాత సంక్షేమసాగు వదిలి సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉన్నది.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): భూమి హక్కులకు సంబంధించి గతంలో అనేక రికార్డులు ఉండేవి. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో 11 రకాల రికార్డులు నిర్వహించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్, రైతు ల భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు వాళ్ల చేతుల్లోనే ఉండేవి. ఒక్కో రికార్డులో మళ్లీ పదుల సంఖ్యలో కాలమ్స్ ఉండేవి. అధికారులే రాతపద్ధతిలో ఆ లెక్కల్లో మార్పు లు, చేర్పులు చేసేవాళ్లు. ఇక్కడే విచ్చలవిడి అవినీతి జరిగేది. ముఖ్యంగా పహాణీలో అక్రమాలకు అంతులేకుండాపోయింది. రికార్డులను తమకు ఇష్టం వచ్చినట్టు మార్చిపడేసే వారు. తెల్లారేసరికి కౌలుదారు యజమాని అయ్యేవాడు.. రైతు రోడ్డున పడేవాడు. పట్టా మారిన పేరు కూడా రైతులకు తెలియకపోయేది.
తాము భూముల హక్కులను కోల్పోయామన్న విషయం రైతులకు ఏండ్లకేండ్లు తెలిసేది కాదు. ఎప్పుడో.. ఇంట్లో ఏదైనా అత్యవసరం అయినప్పుడు, పిల్లల చదువులకో, పెండ్లికో భూమి ని అమ్ముకోవడానికి వెళ్తే ‘భూమి నీ పేరుమీద లేదు’ అని పిడుగులాంటి వార్త తెలిసేది. లబోదిబోమంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయేది. పొలంలో సాగు పనుల్లో ఉండాల్సిన రైతు.. వ్యవసాయాన్ని పక్కకు పెట్టి, పొలం పడావుపెట్టి.. ఆక్రమణదారులతో గొడవలు, వీఆర్వోల కాళ్లమీద పడటాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు, లంచాలు ఇచ్చుకోవడాలు, పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో కేసులు.. ఇన్ని బాధలు అనుభవించాల్సి వచ్చేది. అత్యవసరానికి భూమి ఆదుకోక.. అప్పులు పుట్టక.. పోయిన ప్రాణాలు ఎన్నో. ‘మన భూమి మనకు కాకుండా పోతున్నదే..’ అనే రందితో ఎంతో మంది మంచం పట్టారు. గొడవలు, అవమానాలు భరించలేక ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
రెవెన్యూ అధికారులు నిర్వహించే రికార్డుల్లో ముఖ్యమైనది పహాణీ. ఇందులో మొత్తం 31 కాలమ్స్ ఉండేవి. సర్వే నంబర్లు, బై నంబర్ల వారీగా భూముల విస్తీర్ణం, ఇవీ ఎవరి పేరుమీద ఉన్నాయి? హక్కుదారులు ఎవరు? అనుభవదారులు ఎవరు? ఎన్నేండ్లుగా సాగు చేసుకుంటున్నారు? లాంటి వివరాలన్నీ ఉంటాయి. కాలమ్ నంబర్ 2లో సర్వే నంబర్, 3లో విస్తీర్ణం, 6లో భూమి రకం, 12లో పట్టాదారు పేరు ఉండేది. ఆ తర్వాత ఉన్న మూడు కాలమ్స్ రైతుల మెడకు దూలాలుగా మారాయి. 13వ కాలమ్‌లో అనుభవదారు పేరు, 14లో అనుభవదారు విస్తీర్ణం, 15లో అనుభవదారు స్వభావం ఉండేవి. ఏటా గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఈ రికార్డును అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అవినీతికి బీజం పడేది. లంచాలు తీసుకొని ముందుగా అనుభవదారు కాలంలో పేర్లు ఎక్కించేవారు. తర్వాతి ఏడాది ఏకంగా పట్టాదారుగా మార్చేసేవారు. నేరుగా పట్టాదారుగా పేర్లు మార్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరోవైపు కౌలు తీసుకున్న రైతులు ఒకటి రెండేండ్ల తర్వాత వీఆర్వోలకు లంచాలు ఇచ్చి అనుభవదారు కాలం నుంచి యజమాని కాలంలోకి పేర్లు మార్పించేవారు.
ఉదాహరణకు.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతుకు 7.16 ఎకరాల భూమి 1953 నుంచి పట్టా ఉండేది. అతడి మరణానంతరం ఇద్దరు కొడుకుల పేర్లమీదికి భూమి మారింది. 1993లో అప్పటి వీఆర్వో వేరే వ్యక్తి దగ్గర లంచం తీసుకొని పహాణీల్లో ఈ భూమిని వేరే వ్యక్తి పేరుమీదికి మార్చేశారు. పట్టామార్పిడి జరిగినప్పుడు ఫారం-7లో ఎప్పుడు జరిగింది? ఎలా మారిందో వివరాలు రాయాల్సి ఉంది. కానీ ఆ వీఆర్వో ఆ వివరాలేవీ రాయలేదు. దీంతో అన్నదమ్ములు ఏండ్లపాటు అధికారుల చూట్టూ తిరగాల్సి వచ్చింది. 2019లో ‘నమస్తే తెలంగాణ’ నిర్వహించిన ధర్మగంట కార్యక్రమానికి వచ్చి బాధితులు గోడు వెల్లబోసుకున్నారు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. వాస్తవానికి రైతులు ఏటా ఈ పహాణీని చెక్ చేసుకొని, అందులో తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. కానీ నిరక్షరాస్యత, అనుభవలేమికారణంగా ఏండ్లకేండ్లు పహాణీని చూసుకొనేవారు కాదు. ఇదే అధికారులకు ఊతంగా మారింది. రైతుల పాలిట శాపమైంది.
రైతుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్.. కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. దీని ప్రకారం రైతుల భూముల వివరాలన్నీ డిజిటలైజ్ అయ్యాయి. అన్ని రకాల రికార్డుల స్థానంలో ఒకే ఒక ‘ఆన్లైన్ రికార్డు’ అందుబాటులోకి వచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా కౌలు కాలమ్ కాలగర్భంలో కలిసింది. ‘కౌలు రైతులను మేం గుర్తించం. కౌలు అంటే ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే పొలం కిరాయికి ఇవ్వడం. బంజారాహిల్స్‌లో ఉన్న బంగ్లాలు కిరాయికి ఇస్తరు కదా. అక్కడ కూడా కబ్జాదారు కాలమ్ పెట్టి హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటరా?’ అని సీఎం కేసీఆర్ పదే పదే ప్రస్తావించేవారు. దీంతోపాటు కౌలు రైతులు ఎప్పటికప్పుడు మారిపోతుంటారని, ఎవరు తక్కువ కౌలుకు ఇస్తే వారికి చేస్తుంటారని, అది రైతుకు, కౌలురైతుకు మధ్య అవగాహన అని చెప్పారు.
అందుకే ప్రభుత్వం ఎప్పటికీ కౌలు రైతులను గుర్తించదని స్పష్టం చేశారు. ఈ మేరకు రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాత పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో రైతు పేరు, విస్తీర్ణం, ఇతర వివరాలు మాత్రమే ఉంటాయి. గతంలో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ (భూమి యాజమాన్య హక్కు పత్రం) ఉంటేనే పూర్తి హక్కులు ఉండేవి. రెండింటిలో కలిపి 20 కాలమ్స్ ఉండేవి. కానీ కొత్త పాస్ పుస్తకంలో వాటన్నింటికీ చరమగీతం పాడారు. బ్యాంకు పాస్‌పుస్తకాల మాదిరిగానే.. రైతుల భూములు మార్పిడి జరిగినప్పుడే పుస్తకంలో ప్రింట్ చేసి ఇచ్చేలా విప్లవాత్మక మార్పు తెచ్చారు.
‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కాలమ్స్‌ను తిరిగి తెస్తాం. కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా కాలమ్ తెస్తాం’ అని ఇటీవల కాంగ్రెస్‌కు చెం దిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్ప ష్టం చేశారు. మరోవైపు ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ మొదటి నుంచీ చెప్తున్నది. అంటే రైతుల భూముల హక్కులపై వేటు వేసేందుకు కత్తి పట్టుకొని సిద్ధంగా ఉన్నదన్నమాట. ‘కౌలు రైతులను గుర్తించి రైతుల మెడకు దూలం కట్టదలుచుకోలేదు’ అని సీఎం కేసీఆర్ చెప్పేవారు. ఆ మాటమీదే నిలబడ్డారు. కానీ కాంగ్రెస్ నాయకులు అధికార యావతో 65 లక్షల మంది రైతుల కు టుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమ య్యారు. రికార్డుల్లో కాలమ్‌లు మళ్లీ వస్తే.. వాటిని ఎవరు నిర్వహించాలి?. అంటే మళ్లీ పాత అధికార వ్యవస్థను తెచ్చి, వారికి మార్పు లు, చేర్పులు చేసే అవకాశం ఇస్తారన్నమాట. బాజాప్తా వారి మ్యానిఫెస్టోలోనే వీఆర్వోలను నియమిస్తామన్నారు. దీనినిబట్టే మళ్లీ వీఆర్వో వ్యవస్థను తెస్తారని స్పష్టమవుతున్నది. లంచగొండి వ్యవస్థకు ప్రాణం పోసి, అడ్డగోలుగా సంపాదించుకోవాలని ఎత్తులు వేస్తున్నారు.
భూమి హక్కులకు సంబంధించి తెలంగాణలో అనేక రికార్డులున్నాయి. ప దుల సంఖ్యలో ‘కాలమ్స్’ ఉండేవి. ముఖ్యంగా పహాణీ, సేత్వార్. సెటిల్మెంట్ రికార్డ్స్ లేదా ఆర్ఎస్ఆర్ను సేత్వార్ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో 1940 దశకంలో భూముల సమగ్ర సర్వే జరిగింది. ఆ సమయంలో ఏయే భూములు ఎవరి పేరుమీద ఉన్నాయి? ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు.. ఇలా క్యాటగిరీలవారీగా సమగ్ర వివరాలతో రికార్డులు రూపొందించారు. భూముల వివరాలకు ఇదే ప్రామాణికం. ఇందులో 11 కాలమ్స్ ఉన్నాయి. రెవెన్యూ అధికారులకు ఇవే ఆధారం. ప్రతిదానిలోనూ కాలమ్స్ ఉన్నాయి. అన్ని రికార్డుల్లో కలిపి మొత్తం సుమారు 200 కాలమ్స్ ఉండేవి.
11 రికార్డుల స్థానంలో ప్రభుత్వం ‘ధరణి’ పేరుతో ఒకే ఒక ‘ఆన్లైన్ రెవెన్యూ రికార్డు’ను అందుబాటులోకి తెచ్చింది. భూముల క్రయవిక్రయాలు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సాగుతుండటం, వెనువెంటనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతున్నాయి. దీంతో రికార్డుల నిర్వహణకు ప్రత్యేకంగా మానవ వనరులు అవసరం లేకుండా పోయాయి.
ధరణిలో ఉన్న రికార్డులో మార్పులు, చేర్పులు చేసే అధికారాన్ని కిందిస్థాయి అధికారులకు లేకుండా చేసింది. ఏదైనా సమస్య ఉంటే రైతు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత.. కలెక్టర్ మాత్రమే పరిశీలించి మార్పు చేసే అవకాశం కల్పించింది. గతంలో మాదిరిగా వీఆర్వోలు, ఆర్ఐలు, ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఇష్టం వచ్చినట్టు రికార్డులు మార్చే సంస్కృతికి చరమగీతం పాడింది. ఏకంగా వీఆర్వో వ్యసవ్థను రద్దు చేసింది.