హైదరాబాద్: పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్‌ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపేశాడు. నిజామాబాద్‌లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సీరియస్ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. మృతుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలన్నారు. వారికి అవసరమైన సహాయం చేయాలని సూచించారు. అంకిత భావంతో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
చైన్‌స్నాచర్ రియాజ్‌పై నిజామాబాద్ సీసీఎస్‌కు సమాచారం వచ్చింది. దీంతో సీసీఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్(48) కలిసి బైక్‌పై బయల్దేరారు. ఖిల్లా ప్రాంతంలో అతడిని పట్టుకున్న పోలీసులు.. తనిఖీ చేయకుండానే ఠాణాకు తీసుకెళ్లేందుకు తమ బైక్‌పై ఎక్కించుకున్నారు. వినాయక్‌నగర్ వద్ద నిందితుడు కత్తి తీసి కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ను దవాఖానకు తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.