హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ‘యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతి భద్రతలు కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు’ అంటూ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లోనే బీ శివధర్‌రెడ్డి పోలీసు సిబ్బందికి లేఖ రాశారు. అందులో పలు అంశాలు ప్రస్తావిస్తూ సున్నితంగా హెచ్చరించారు. అయినా, లంచాలు తీసుకోవడంలో పోలీసుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. దీంతో బుధవారం మరోసారి ‘పోలీసులు అవినీతికి దూరంగా ఉండండి. ప్రజా సమస్యలు పరిష్కరించండి, శాంతిభద్రతలు కాపాడండి’ అంటూ డీజీపీ హెచ్చరించారు.
పోలీసులు లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీకి ప్రజల నుంచి దర్యాప్తులు వెల్లువెత్తుతుండటంతో ఏసీబీ కూడా వేగాన్ని పెంచింది. తాజాగా, శంషాబాద్‌లోని ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ అవుట్ పోస్టులో ఇన్స్పెక్టర్ సంపాతి కనకయ్య, ఎస్సై యూ కే సిద్ధేశ్వర్ ఒక కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు, నిందితుల కుటుంబసభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.5లక్షలు లంచం డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.