హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోకి వచ్చే డ్రగ్స్‌ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు చురుకైన పాత్ర పోషించాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో జిల్లాల ఎస్పీలు, సీపీలతో అర్ధవార్షిక నేర సమీక్షను మంగళవారం కొనసాగించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అధికారులు ఇలానే స్తబ్ధుగా పనిచేస్తే.. డ్రగ్స్‌ను ఎప్పటికి నియంత్రిస్తారని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చామని, వాటిని ఎస్పీలు, సీ పీలు కఠినంగా అమలు చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. స్థానికులతో మమేకమై.. అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. ముఖ్యంగా విద్యాసంస్థలలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వ్యవస్థీకృత నేరాలను ముందే పసిగట్టాలని డీజీపీ చెప్పారు. కొత్తగా నమోదైన నేరాల ధోరణులపై సీఐడీ డీజీ శిఖా గోయల్ వివరణ ఇచ్చారు.
శాంతిభద్రతలే ముఖ్యం: మహేశ్ భగవత్
రాష్ట్రంలో అక్కడక్కడ శాంతిభద్రతలు గాడి తప్పుతున్న వైనాన్ని లాఅండ్ ఆర్డర్ డీజీ మహేశ్ ఎం భగవత్ వివరణాత్మ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘర్షణలు, రోడ్లపై దారుణ హత్య లు, ఆందోళనలు, వాటి నివారణపై చర్యలకు సీపీలు, ఎస్పీలను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఏడీజీ అనిల్‌కుమార్, ఐజీలు వీ సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్, డీసీపీ శ్వేతారెడ్డి వివరించారు.