హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కొందరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందిని కేటాయించినట్టు చెప్పారు. కొన్ని వివాదాస్పద సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పార్టీలను, నేతలను కించపర్చేలా పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, ఆడియోలు పెట్టే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. సీ విజిల్ నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు సైబర్ పోలీసులు పరిష్కరిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 350కి పైగా అతి సున్నితమైన ప్రదేశాలను గుర్తించామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. మావోస్టులు ప్రభావం అత్యధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాలతోపాటు, రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటికే పారా మిలటరీ బలగాలు మోహరించాయని తెలిపారు. మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్ ఓపెనింగ్, ఏరియా డామినేషన్స్, కూంబింగ్ ఆపరేషన్స్ విస్తృతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పాతబస్తీలోని సున్నిత ప్రాంతాలనను సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 9,130కి పైగా కేసులు నమోదు చేశామని, రూ.190 కోట్లకు పైగా నగదు సీజ్ చేశామని డీజీపీ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా లక్ష మందికి పైగా సిబ్బంది బందోబస్తులో ఉన్నారని తెలిపారు. తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపామని వివరించారు.